కాంగ్రెస్‌లో షర్మిల కథ కంచికే..?
ప్రస్తుతం జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల్లో వైఎస్ షర్మిల ఊసే కనబడటం లేదు. కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపిస్తానని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆమెకు మొండిచెయ్యి చూపించినట్లుగా అర్థం అవుతుంది.
కాంగ్రెస్ పార్టీలో షర్మిల కథ కంచికి చేరేట్లుగా ఉంది. ఎంతలా గించుకున్నా.. కంఠశోష తప్ప ఆ పార్టీలో ఆమెకు దక్కే ప్రాధాన్యం ఏమీ ఉండదని అర్థమైపోతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ షర్మిలను ఒక పావుగా వాడుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో అంతరించిపోయిన కాంగ్రెస్ పార్టీకి షర్మిలను అధ్యక్షురాలిగా చేయడంలోనే పెద్ద కుట్ర ఉందనే ప్రచారం జరుగుతోంది. ఎన్నికల తర్వాత ఆమె రాజకీయాలకు పనికి రాదని ప్రచారం చేసినా ఆశ్చర్యం లేదని తాజా పరిణామాలు చూస్తే అర్థం అవుతుంది.
ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ తరఫున పనిచేయడానికి అంగీకరిస్తే రాజ్యసభ సీటు ఇస్తామని షర్మిలకు పార్టీ అధిష్టానం హామీ ఇచ్చినట్లు మొదట్లో చెప్పుకొచ్చారు. కర్ణాటక నుంచి ఆమెను ఎగువ సభకు పంపిస్తారని ఆశ చూపారని, అందుకే వైఎస్సార్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు, ఏపీ అధ్యక్ష బాధ్యతలు అందుకొని పనిచేసేందుకు ఒప్పుకున్నారని ఇటీవల కాలంలో చర్చ జరిగింది. ప్రస్తుతం జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల్లో వైఎస్ షర్మిల ఊసే కనబడటం లేదు. కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపిస్తానని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆమెకు మొండిచెయ్యి చూపించినట్లుగా అర్థం అవుతుంది. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల వరకు షర్మిలను వాడుకుని వదిలేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయనే చర్చ కూడా తాజా పరిణామాలతో మొదలైంది.
తెలంగాణ నుంచి మూడు, కర్ణాటక నుంచి నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ కాబోతున్నాయి. అన్ని పార్టీలు వారి బలాబలాలను దృష్టిలో పెట్టుకొని అభ్యర్థుల ప్రకటించాయి, నామినేషన్ల ప్రక్రియ కూడా నేటితో ముగియనుంది. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం షర్మిలకు ఇచ్చిన మాటను దాటవేసినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఏపీ రాజకీయాల్లోకి ప్రవేశించిన షర్మిల ఇప్పుడు రెంటికీ చెడ్డ రేవడిలా తయారయ్యారా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. తాను స్థాపించిన పార్టీని విలీనం చేస్తున్నానని చెప్పిన షర్మిల ఇప్పుడు తెలంగాణకూ వెళ్లలేరు.. అలాగని ఏపీలో అసలు ఉనికే లేని కాంగ్రెస్ బండిని లాగనూ లేరు.