వైఎస్ భారతిపై ఫిర్యాదు.. తెర వెనుక ఉన్నది ఎవరు..?

వైఎస్ షర్మిల ఫొటో ఉన్న అడ్వర్టైజ్మెంట్ ని కూడా తన పత్రికలో ప్రచురించడానికి వైఎస్ భారతి రెడ్డి అంగీకరించలేదని ఆ పత్రికలో ఒక కథనం వచ్చింది.

Advertisement
Update:2023-02-21 08:40 IST

వైఎస్ ఫ్యామిలీలో విభజన వచ్చిందన్న అభిప్రాయం బలంగానే ఉంది. అందుకు ప్రత్యక్షంగా కొన్ని ఉదంతాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా షర్మిలకు.. జగన్ దంపతులకు మధ్య గ్యాప్ బాగానే ఉందన్న చర్చ ఉంది. షర్మిల తెలంగాణలో పెట్టిన పార్టీతో తమకు సంబంధం లేదని జగన్మోహన్ రెడ్డి ప్రతినిధి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించిన తర్వాత నుంచి ఈ భావన మరింత బలపడింది.

అయితే షర్మిలకు జగన్ కి మధ్య కంటే.. వైఎస్ భారతి, షర్మిల మధ్య గ్యాప్ అధికంగా ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తుంటాయి.

వైఎస్ ఫ్యామిలీలో అంతర్గతంగా జరుగుతున్న విషయాలను ఆంధ్రజ్యోతి పత్రిక పదేపదే పక్కాగా ప్రచురించడం వెనుక వైఎస్ షర్మిల బృందం ఇస్తున్న లీకులే కారణమని వైసీపీ నేతలు భావిస్తున్నారు. తాజాగా అదే ఆంధ్రజ్యోతి పత్రిక ఒక కీలకమైన అంశాన్ని ప్రధానంగా ప్రచురించింది. వైఎస్ షర్మిల ఫొటో ఉన్న అడ్వర్టైజ్మెంట్ ని కూడా తన పత్రికలో ప్రచురించడానికి వైఎస్ భారతి రెడ్డి అంగీకరించలేదని ఆ పత్రికలో ఒక కథనం వచ్చింది.

వైఎస్ జయంతి రోజు కడప జిల్లాకు చెందిన కొర్రు భాస్కర్ రెడ్డి.. జగన్, షర్మిల, వైఎస్ ఫొటోలతో ఉన్న ఒక ప్రకటనను సాక్షిలో వేసేందుకు సంప్రదించారు. కడప జిల్లాకే చెందిన కొర్రు భాస్కర్ రెడ్డి ప్రతి ఏటా ఈ తరహా ప్రకటన సాక్షి పత్రికలో ఇస్తూ ఉంటారు. ఈయన వైఎస్ కు సన్నిహితుడు కూడా. గత వైఎస్ జయంతి సందర్భంగా భాస్కర్ రెడ్డి ఇచ్చిన ప్రకటనను డబ్బులు తీసుకొని ప్రచురించేందుకు తొలుత సాక్షి సిబ్బంది అంగీకరించారు. అందుకు సంబంధించిన డిజైన్ తో పాటు పేమెంట్ కు సంబంధించి చెక్కును కూడా భాస్కర్ రెడ్డి పంపించారు. అయితే ఆఖరి నిమిషంలో ఈ ప్రకటన సాక్షిలో ప్రచురించడం సాధ్యం కాదంటూ చెప్పారని భాస్కర్ రెడ్డి ఆరోపిస్తున్నారు.

ప్రకటనలో షర్మిల ఫొటో ఉందని, అందువల్ల భారతి రెడ్డి అంగీకరించలేదని సాక్షి సిబ్బంది తనకు చెప్పినట్టు భాస్కర్ రెడ్డి ఆరోపించారు. ఈ చర్య వల్ల తాను ఎంతో మనోవేధనకు గురయ్యానంటూ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో వైఎస్ భారతీ రెడ్డి పై ఫిర్యాదు చేశారు. డబ్బులు ఇచ్చి వేయించుకుంటున్న ప్రకటనలో షర్మిల ఫొటో వేయాలని కోరే హక్కు తనకు ఉంటుందని ఆమె ఫొటోపై నిషేధమేమీ లేదని, కాబట్టి సాక్షి యాజమాన్యం వ్యవహరించిన తీరు తన హక్కులను కాలరాసేలా ఉందని భాస్కర్ రెడ్డి ఫిర్యాదు చేశారు.

బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో భారతీ రెడ్డి తో పాటు సాక్షిలోని మరో ఐదుగురిపై ఫిర్యాదు చేయడమే కాకుండా.. వీరందరిపై ఐపీసీ సెక్షన్ 420, 500, 120 బి, 34 కింద చర్యలు తీసుకోవాలంటూ ఆయన కోర్టులో పిటిషన్ కూడా వేశారు. కొర్రు భాస్కర్ రెడ్డి ఇలా ఏకంగా వైఎస్ భారతిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం, కోర్టును కూడా ఆశ్రయించడం బట్టి అతడి వెనుక ఎవరో పెద్దవాళ్లే ఉండి ఉంటారని భావిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News