జగన్ ని కలిసేందుకు క్యూ కట్టిన అభిమానులు
ఇటీవల బెంగళూరు నుంచి తాడేపల్లికి వచ్చిన జగన్, క్యాంప్ ఆఫీస్ లో కార్యకర్తలు, సామాన్య ప్రజలను కలిశారు. వారందరికీ ధైర్యం చెప్పారు.
తాడేపల్లి అయినా, పులివెందుల అయినా.. మాజీ ముఖ్యమంత్రి జగన్ ని కలిసేందుకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు క్యూ కడుతున్నారు. జగన్ కూడా వారికి తగిన సమయం కేటాయిస్తున్నారు. ఇటీవల బెంగళూరు నుంచి తాడేపల్లికి వచ్చిన జగన్, క్యాంప్ ఆఫీస్ లో కార్యకర్తలు, సామాన్య ప్రజలను కలిశారు. వారందరికీ ధైర్యం చెప్పారు. వైసీపీ నేతలు వారికి అండగా ఉంటారని భరోసా ఇచ్చారు.
ఢిల్లీ ధర్నా తర్వాత వైసీపీ రాజకీయం మళ్లీ కాస్త నెమ్మదించిందనే చెప్పాలి. ఏపీలో జరుగుతున్న మారణహోమంపై కేంద్రం స్పందించాలని, ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ధర్నా చేశారు వైసీపీ నేతలు. ఆ తర్వాత ఏపీకి వచ్చిన జగన్ సుదీర్ఘ ప్రెస్ మీట్ పెట్టి టీడీపీ విధానాలపై మండిపడ్డారు. వైట్ పేపర్స్ పేరుతో తమపై తప్పులు నెడుతున్నారని అన్నారు. అనంతరం బెంగళూరు వెళ్లారు, తిరిగి అక్కడినుంచి వచ్చిన జగన్ తాడేపల్లిలో ప్రజలను కలిశారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
జగన్ తోపాటు వైసీపీ నేతలు ఒక్కొక్కరే బయటకు వస్తున్నారు, ప్రెస్ మీట్లు పెడుతున్నారు, మరికొందరు సామాన్య ప్రజల సమస్యల పరిష్కారం కోసం అధికారుల వద్దకు వెళ్తున్నారు. త్వరలో జగన్ ప్రజల్లోకి వస్తారని ప్రకటించినా ఆ కార్యక్రమానికి సంబంధించిన రూట్ మ్యాప్ ఇంకా ఖరారు కాలేదు. కూటమి ప్రభుత్వానికి మరింత సమయం ఇచ్చి చూడాలా లేక ప్రజల్లోకి వెళ్లి నిరసన కార్యక్రమాలు మొదలు పెట్టాలా అనే ఆలోచనలో ఉన్నారు వైసీపీ నేతలు.