ఇది క్యాస్ట్ వార్ కాదు, క్లాస్ వార్.. నేతలకు జగన్ దిశానిర్దేశం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. జగన్ మాటల్లో ఎక్కడా అస్పష్టత లేదు. తాను చేయాల్సిందంతా చేశానని, పార్టీని గెలిపించుకొని రావాల్సిన బాధ్యత మీదేనని ఆయన కేడర్‌కు సూచించారు. వచ్చే 45 రోజులు అత్యంత కీలకమని, ఓటర్లను కనీసం ఐదుసార్లు కలవాలని ఆయన చెప్పారు. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వం చేసిన మంచిని చెప్పాలని ఆయన అన్నారు. సంక్షేమం కొనసాగాలంటే మళ్లీ వైసీపీ అధికారంలోకి రావాలని ఆయన అన్నారు. వైసీపీ మళ్లీ వస్తేనే పేదవాడికి న్యాయం జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ ఎన్నికల్లో జరిగేది క్యాస్ట్ వారు కాదని, క్లాస్‌వార్ అని, పేదవాళ్లకూ పెత్తందార్లకు మధ్య జరిగే యుద్ధమని ఆయన అన్నారు. దాదాపు అన్ని సీట్లకు అభ్యర్థులను ఖరారు చేశామని, క్షేత్ర స్థాయిలో మనం బలంగా ఉన్నామని, బూత్ స్థాయిలో పార్టీని త్వరగా యాక్టివేట్ చేయాలని ఆయన చెప్పారు.
మంగళగిరిలో మంగళవారం జరిగిన సమావేశంలో జగన్ పార్టీ నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి విశ్వసనీయత లేదని, చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేశారని, సాధ్యం కాని హామీలను చంద్రబాబు మేనిఫెస్టోలో పెట్టాడని, వాటిని అమలు చేయకుండా మేనిఫెస్టోను వెబ్‌సైట్ నుంచి తీసేశాడని ఆయన అన్నారు. విశ్వసనీయత ఉన్న ఏకైక పార్టీ వైసీపీ అని ఆయన చెప్పారు.
మనం రెండే రెండు పేజీలతో మేనిఫోస్టో తెచ్చామని, మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను నెరవేర్చామని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని 87 శాతం ఇళ్లకు సంక్షేమం అందించామని, కుప్పంలో 87 వేల ఇళ్లు ఉంటే 83 వేల ఇళ్లకు మంచి జరిగిందని ఆయన చెప్పారు. రూ.2 లక్షల 55 వేల కోట్లు పేదల ఖాతాల్లో జమ అయ్యాయని జగన్ చెప్పారు. కుప్పంలో 45 వేల కుటుంబాలకు రూ.1400 కోట్లు అందించామని ఆయన చెప్పారు.
జగన్ మాట్లాడిన అంశాల్లోని ప్రధానాంశాలు..
- గతంలో వెయ్యి ఉన్న పింఛన్ ను రూ. 3 వేలు చేశాం
- రాష్ట్రవ్యాప్తంగా జగన్ బటన్ నొక్కడం నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశాం
- మనం చేసే మంచి చూసి ... ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి
- 57 నెలల కాలంలో సంక్షేమ పాలన అందించాం
- ఎప్పుడూ జరగని విప్లవాత్మక మార్పులు జరిగాయి
- కలలో కూడా ఊహించని విధంగా అవినీతికి తావులేకుండా సంక్షేమ పథకాలు అందించాం
- ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశాం
- గ్రామాల్లో స్కూళ్ల రూపురేఖలు మారాయి
- ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియాన్ని అందుబాటులోకి తెచ్చాం
- పేదరికం నుంచి బయటపడాలంటే నాణ్యమైన విద్య అవసరం
- జగన్ గెలిస్తేనే పేదవాడికి న్యాయం జరుగుతుంది
- నా ఎస్సీ, ఎస్టీ, బీసీలే కాదు నా నిరుపేదలని కూడా అంటా
- ఓసీల్లో కూడా నిరుపేదలు ఉన్నారు
- మహిళల రక్షణ కోసం దిశ యాప్ తీసుకొచ్చాం
- ఫోన్ షేక్ చేస్తే చాలు ... మహిళలకు రక్షణ దొరుకుతుంది
- మీ జగన్ ఉంటే పేదవాడు బాగుపడతాడు
- మీ జగన్ ఉంటే సంక్షేమ పథకాలు కొనసాగుతాయి
- ఆరోగ్యశ్రీ ని అత్యుత్తమ స్థాయిలో విస్తరించాం
- ఏ పథకం ఎప్పుడు ఇవ్వాలో ఆ సమయం దాటిపోక ముందే ఇస్తున్నాం
- జగన్ ఉంటేనే విలేజ్ క్లినిక్స్ పనిచేస్తాయి
- జగన్ రాకుంటే మళ్లీ జన్మభూమి కమిటీలదే రాజ్యమవుతుంది
- జగన్ చేయగలిగింది మాత్రమే చెబుతాడు
- చంద్రబాబు మాత్రం ఎలాంటి అబద్దాలయినా చెబుతాడు
- తన అవసరాల కోసం ఎవరినైనా మోసం చేస్తాడు
- ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికి వెళ్లి చేసిన మంచిని చెప్పండి
- జరిగిన మంచిని బాగా చెప్పగలిగితేనే విజయం సాధిస్తాం
- ఇంత మంచి చేసినప్పుడు మెజార్టీతో ఎందుకు గెలవలేం
- నా స్థాయిలో నేను చేయగలిగినదంతా చేశాను
- ఇప్పుడు మీ వంతు .. మీరందరూ గెలిచి రావాలి
- 175 కు 175 అసెంబ్లీ సీట్లు గెలవాల్సిందే