నేడు రైతుల అకౌంట్లలోకి రూ. 2,096.04 కోట్లు.. బటన్ నొక్కనున్న సీఎం వైఎస్ జగన్
సంక్రాంతి సమయంలో మరోసారి రైతుల అకౌంట్లలో రూ. 2000 జమ కానున్నది. దీంతో ఈ ఏడాది మొత్తం సాయం రూ. 13,500 అవుతుంది.
ఏపీలోని రైతుల అకౌంట్లలో వరుసగా నాలుగో ఏడాది వైఎస్ఆర్ రైతు భరోసా - పీఎం కిసాన్ పథకం రెండో విడత సాయాన్ని ఇవాళ జమ చేయనున్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఈ రోజు జరిగే ఓ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కిన వెంటనే ఈ మొత్తం రైతుల అకౌంట్లలోకి జమ అవుతుంది. సోమవారం ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నుంచి గన్నవరం వెళ్లి.. అక్కడి నుంచి నేరుగా వైఎస్ జగన్ ఆళ్లగడ్డ చేరుకుంటారు. బహిరంగ సభతో పాటు రైతులతో ఆయన ముచ్చటించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 50.92 లక్షల మంది రైతుల అకౌంట్లలో రెండో విడత రైతు భరోసా సాయం రూ. 2,096.04 కోట్లు జమ కానున్నది. ఒక్కక్కరి అకౌంట్లో రూ. 4,000 జమ అవుతుంది. ఇప్పటికే తొలి విడత సాయంగా రూ. 7,500 అందరికి జమ చేశారు.
ఇక సంక్రాంతి సమయంలో మరోసారి రైతుల అకౌంట్లలో రూ. 2000 జమ కానున్నది. దీంతో ఈ ఏడాది మొత్తం సాయం రూ. 13,500 అవుతుంది. ప్రతీ ఏడాది ఇంతే మొత్తం రైతుల అకౌంట్లలో ఏపీ ప్రభుత్వం జమ చేస్తోంది. సొంత పొలాల్లో వ్యవసాయం చేసుకునే అందరూ రైతులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలు రైతులు, అటవీ, దేవాదాయ భూములు సాగు చేసే రైతులకు ఏడాదికి రూ. 13,500 పెట్టుబడి సాయంగా అందిస్తోంది. దేశంలో అన్ని వర్గాల రైతులకు పెట్టుబడి సాయం అందించే ఏకైక ప్రభుత్వం ఏపీ మాత్రమే. ఇప్పటి వరకు రైతు భరోసా ద్వారా మొత్తం రూ. 25,971.33 కోట్ల సాయాన్ని అందించింది.
వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో గత మూడున్నర ఏళ్లలో రైతులకు రూ. 1,33,526.92 కోట్ల మేర ప్రయోజనం చేకూరింది. రైతు భరోసాతో పాటు ఈ-క్రాప్‌లోనమోదు చేసుకున్న రైతులకు పంట రుణాలు, బీమా రిజిస్ట్రేషన్, వైఎస్ఆర్ సున్నా వడ్డీ రుణాలు, ఉచిత పంటల బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ వంటి ప్రయోజనాలు దక్కుతున్నాయి. పగటి పూట రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ కూడా అందిస్తోంది. ఆధునిక యంత్రాల కొనుగోలుకు వైఎస్ఆర్ యంత్రసేవ పథకాన్ని అమలు చేస్తోంది. రూ. 3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసింది.