జయరాం యాక్షన్‌కు జగన్ రియాక్షన్.. మంత్రిమండలి నుంచి బర్తరఫ్
ప్రభుత్వం తీరు, జగన్ వైఖరి నచ్చక పార్టీకి, మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నానని జయరాం ప్రకటించారు. ఆయన రాజీనామా లేఖ అధికారికంగా అందక ముందే జగన్ తక్షణం స్పందించారు.
వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన మంత్రి గుమ్మనూరు జయరాంపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ రాష్ట్ర మంత్రి మండలి నుంచి జయరాంను బర్తరఫ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ సిఫార్సు మేరకు గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి మంగళవారం రాత్రి ప్రకటించారు.
ఇలా రాజీనామా చేసి.. అలా టీడీపీలో చేరారు
మంత్రి పదవికి, వైసీపీకి రాజీనామా చేస్తున్నానంటూ జయరాం మంగళవారం ఉదయం విజయవాడలో విలేకరుల సమావేశంలో ప్రకటించారు. సాయంత్రం మంగళగిరిలో వెళ్లి టీడీపీ-జనసేన ఆధ్వర్యంలో జరిగిన జయహో-బీసీ సదస్సులో పాల్గొని వేదికపై చంద్రబాబుతో టీడీపీ కండువా కప్పించుకున్నారు.
వెంటనే చర్యలు
ప్రభుత్వం తీరు, జగన్ వైఖరి నచ్చక పార్టీకి, మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నానని జయరాం ప్రకటించారు. ఆయన రాజీనామా లేఖ అధికారికంగా అందక ముందే జగన్ తక్షణం స్పందించారు. గుమ్మనూరు టీడీపీలో చేరిన మూడు నాలుగు గంటల్లోనే ఆయన్ను క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని సీఎం సిఫార్సు చేశారు. దాన్ని గవర్నర్ ఆమోదించడం, గెజిట్ వెలువడటం చకచకా జరిగిపోయాయి. పార్టీ మారాలని ఫిక్సయిపోయి జగన్ వైఖరి నచ్చకే రిజైన్ చేస్తున్నానంటూ గుమ్మనూరు నాటకాన్ని రక్తికట్టించకముందే ఏకంగా బర్తరఫ్ చేయించి జగన్ స్పీడ్‌గా రియాక్షన్ చూపించడం గమనార్హం.