ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ పాఠాలు.. ఏపీలో విద్యావ్యవస్థకు కొత్త హంగులు
ఆరో తరగతి నుంచి విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను ఒక స్పెషల్ సబ్జెక్టుగా బోధించాలని సీఎం నిర్ణయించారు. ఈ పాఠ్యాంశాల బోధనకు ఒక ప్రత్యేక యాప్ రూపొందించాలని ఆదేశించారు.
ఆంధ్రరాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలు, ఆ మాటకొస్తే కార్పొరేట్ స్కూల్స్ కంటే మిన్నగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారు. దీనిలో భాగంగా ఆరో తరగతి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను కూడా బోధించేందుకు ఏర్పాట్లు చేయాలని జగన్ ఆదేశించారు.
ప్రత్యేక పాఠ్యాంశంగా ఏఐ.. బోధనకు యాప్
ఆరో తరగతి నుంచి విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను ఒక స్పెషల్ సబ్జెక్టుగా బోధించాలని సీఎం నిర్ణయించారు. ఈ పాఠ్యాంశాల బోధనకు ఒక ప్రత్యేక యాప్ రూపొందించాలని ఆదేశించారు. ఇందుకోసం చర్యలు తీసుకోవాలని ఆయన తాజాగా జరిగిన విద్యాశాఖ సమీక్షలో ఆదేశాలు జారీ చేశారు.
యూపీ తర్వాత ఏపీనే
వచ్చే విద్యా సంవత్సరం నుంచి అంటే 2024-25 నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆరు నుంచి 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు బేసిక్ కోడింగ్ నైపుణ్యాలు, ఏఐ పాఠ్యాంశాలను బోధించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. దాని తర్వాత ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అదీ ఆరో తరగతి నుంచే ఏఐను బోధించాలని నిర్ణయించిన రెండో రాష్ట్రం ఏపీయేనని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.