ఈ గట్టునుంటారా..? ఆ గట్టుకెళ్తారా..?
ఒకటో తేదీన సూర్యుడు ఉదయించకముందే వాలంటీర్లు వచ్చి పెన్షన్లు అందించేవారని, అలాంటి కార్యక్రమాన్ని చంద్రబాబు కావాలనే అడ్డుకున్నారని.. ఆయన మనిషా, శాడిస్టా అని అన్నారు సీఎం జగన్.
విశ్వసనీయత ఓవైపు, మోసం మరోవైపు
నిజం ఒకవైపు, అబద్ధం మరోవైపు
ఇంటింటి ప్రగతి ఓవైపు, తిరుగోమనం మరోవైపు
ఇంటింటి అభివృద్ధి ఓవైపు, అసూయ మరోవైపు
మంచి ఓవైపు, చెడు మరోవైపు
వెలుగు ఓవైపు, చీకటి మరోవైపు
ధర్మం ఓవైపు, అధర్మం మరోవైపు
ఈ రెండు ప్రత్యామ్నాయాలు ప్రజల ముందు ఉన్నాయని, వీటిలో ఏది కావాలో ప్రజలు ఆలోచించుకోవాలని సూచించారు సీఎం జగన్. ప్రజలిచ్చిన అధికారాన్ని ఇంటింటి ప్రగతి, ఇంటింటి అభివృద్ధి, ఇంటింటి మంచి, పిల్లల భవిష్యత్ కోసం తాను సవ్యదిశలో ఉపయోగించానని అన్నారు. గతంలో మూడుసార్లు అధికారంలో ఉండి.. అబద్ధం, మోసం, అన్యాయం, తిరోగమనం, చెడు, చీకటి.. అనేవాటిని ప్రజలకు రిటర్న్ గిఫ్ట్ గా చంద్రబాబు ఇచ్చారన్నారు. ఈ ఎన్నికలు జగన్ కు, చంద్రబాబుకి మధ్య యుద్ధం కాదని.. ఈ ఎన్నికలు.. మోసం చేయడమే అలవాటైన ఓ నేరస్తుడికి, ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధం అని వివరించారు. ఈ యుద్ధంలో తాను ప్రజల పక్షాన ఉన్నానని.. దత్తపుత్రుడు, ఎల్లో మీడియా, రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీ, ప్రత్యేక హోదా ఇవ్వకుండా అన్యాయం చేసిన మరోపార్టీ.. వీరంతా చంద్రబాబు వైపు ఉన్నారని చెప్పారు జగన్. తన ఒక్కడిపై అంతమంది యుద్ధానికి వస్తున్నారని అన్నారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా 7వ రోజు చిత్తూరు జిల్లా పూతలపట్టు బైపాస్‌లో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొన్నారు.
శాడిస్ట్ బాబు
ఒకటో తేదీన సూర్యుడు ఉదయించకముందే వాలంటీర్లు వచ్చి పెన్షన్లు అందించేవారని, అలాంటి కార్యక్రమాన్ని చంద్రబాబు కావాలనే అడ్డుకున్నారని.. ఆయన మనిషా, శాడిస్టా అని అన్నారు సీఎం జగన్. అలాంటికి వ్యక్తికి ఓటు వేయడం ధర్మమేనా? అని ప్రశ్నించారు. పథకం ప్రకారం ఈసీకి తన మనిషి నిమ్మగడ్డతో లేఖ రాయించి వాలంటీర్ల వ్యవస్థను అడ్డుకున్నారని మండిపడ్డారు. జగన్ వస్తేనే మళ్లీ వాలంటీర్లు వస్తారని, ప్రతి పథకం మీ ఇంటికే వస్తుందిని చెప్పారు. చంద్రబాబు అనే చంద్రముఖిని పెట్టెలో బంధించి, మన రక్తం తాగకుండా జాగ్రత్తపడాల్సిన సమయం వచ్చిందని వివరించారు.
రాష్ట్రంలో 175కి 175 అసెంబ్లీ సీట్లు, 25కి 25కి ఎంపీ సీట్లు గెలవడమే మన టార్గెట్ అని చెప్పారు సీఎం జగన్. డబుల్‌సెంచరీ కొట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఎవరి పాలనలో మంచి జరిగిందో ఆలోచించి ప్రజలు ఓటు వేయాలని సూచించారు.