మీకు మరింత మంచి చేసేందుకు దేవుడు నాకు పెద్ద స్క్రిప్ట్ రాశాడు
అర్జునుడి మీద ఒక్క బాణం వేసినంత మాత్రాన కౌరవులు గెలిచినట్లు కాదన్నారు. జగన్ మీద ఒక్క రాయి విసిరినంత మాత్రాన జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో వారు గెలవలేరన్నారు.
గుడివాడ 'మేమంతా సిద్ధం' సభలో సీఎం జగన్ ఉద్వేగభరితంగా మాట్లాడారు. నుదుటి మీద వారు చేసిన గాయంతో బయటపడ్డానంటే దానర్థం దేవుడు తన విషయంలో ఇంకా పెద్ద స్క్రిప్ట్ రాశాడని అన్నారు. తన నుదుటి మీద గాయం బహుశా 10 రోజుల్లో తగ్గిపోతుందని, కానీ పేదల విషయంలో చంద్రబాబు చేసిన గాయాలు ఎప్పటికీ మానవని అన్నారు. దాడుల వల్ల తన సంకల్పం చెక్కుచెదరదని, ఇలాంటి తాటాకు చప్పుళ్లకు తాను అదరను, బెదరను అని క్లారిటీ ఇచ్చారు జగన్.
టీడీపీ-బీజేపీ-జనసేన కూటమితోపాటు కాంగ్రెస్ కూడా వారితోనే జతకలిసిందని.. వారు చాలదన్నట్టు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5.. కూడా వారితో చేరి కుటిల పద్మవ్యూహం పన్నాయని అన్నారు సీఎం జగన్. వారంతా ఒక్కటై తనపై బాణాలు సంధిస్తున్నారని చెప్పారు. "మీకు మంచి చేసిన మీ జగన్ మీద, మీ బిడ్డ మీద వారు దాడి చేస్తున్నారు. అయినా మీ బిడ్డ అదరడు, మీ బిడ్డ బెదరడు." అని అన్నారు. రాష్ట్ర ప్రజలు శ్రీకృష్ణుడి లాగా ఈ యుద్ధంలో అర్జునుడు అనే తనకు అండగా నిలబడ్డారని చెప్పారు. అర్జునుడి మీద ఒక్క బాణం వేసినంత మాత్రాన కౌరవులు గెలిచినట్లు కాదన్నారు. జగన్ మీద ఒక్క రాయి విసిరినంత మాత్రాన జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో వారు గెలవలేరన్నారు. ఆ దుష్ట చతుష్టయం ఓటమిని, పెత్తందారుల ఓటమిని, మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరూ ఆపలేరని అన్నారు జగన్.
ఓట్లకోసం తనపై దాడులు చేసే స్థాయికి దిగజారారు అంటే.. వారి ఓటమి ఖాయమైనట్టేనని చెప్పారు సీఎం జగన్. విజయానికి మనం అంత చేరువగా ఉన్నామని ఈ ఘటనతో రుజువైందని అన్నారు. ప్రజల సంక్షేమం కోసం, పేదల భవిష్యత్ కోసం, పథకాలన్నీ కాపాడుకునేందుకు, వాటిని కొనసాగించేందుకు, ప్రతీ ఇంటి గౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం, పెత్తందార్లపై యుద్ధానికి మీరంతా సిద్ధమేనా? అని సభకు వచ్చినవారిని ఉత్సాహపరిచారు జగన్.