ఆయన దగా స్టార్.. ఈయన మ్యారేజీ స్టార్
చంద్రబాబు, పవన్ కల్యాణ్ జోడీలో ఒకరికి విశ్వసనీయత లేదని, ఇంకొకరికి విలువలు లేవని మండిపడ్డారు జగన్. ఆ ఇద్దరు ఇప్పుడు బీజేపీతో చేతులు కలిపారని, గతంలో కూడా ఇలానే ప్రజల్ని మభ్యపెట్టారని గుర్తు చేశారు.
బనగానపల్లెలో ఈబీసీ నేస్తం నిధుల విడుదల సందర్భంగా మరోసారి ప్రతిపక్షాలపై ధ్వజమెత్తారు సీఎం జగన్. పేదల భవిష్యత్తుపై యుద్ధానికి చంద్రబాబు కూటమి మరోసారి సిద్ధమైందని.. ఈ ఎన్నికల్లో ఓటు అనే దివ్యాస్త్రాన్ని వాళ్ల మీద జాగ్రత్తగా ప్రయోగించాలని ప్రజలకు సూచించారు. చంద్రబాబు పేరు చెబితే ఆయన చేసిన వంచనలు మాత్రమే గుర్తొస్తాయన్నారు జగన్. పొదుపు సంఘాల మహిళలకు ఆయన చేసిన దగా గుర్తొస్తుందని చెప్పారు. ఆయన హయాంలో జరిగిన ఒక్క మంచి కూడా ఎవరికీ గుర్తు రాదన్నారు. ఇక దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థను భ్రష్టు పట్టించే ఓ మోసగాడు గుర్తొస్తాడని, ఏడేళ్లకోసారి కార్లు మార్చినట్టు భార్యలను మార్చే ఒక మ్యారేజీ స్టార్, ఓ వంచకుడు గుర్తొస్తాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు జగన్.
చంద్రబాబు, పవన్ కల్యాణ్ జోడీలో ఒకరికి విశ్వసనీయత లేదని, ఇంకొకరికి విలువలు లేవని మండిపడ్డారు జగన్. ఆ ఇద్దరు ఇప్పుడు బీజేపీతో చేతులు కలిపారని, 2014లో కూడా వారు ఇలాగే తెరపైకి వచ్చారని, మోసపూరిత వాగ్దానాలతో ప్రజల్ని మభ్యపెట్టారని గుర్తు చేశారు. ఆనాడు మేనిఫెస్టోని చంద్రబాబు సంతకం పెట్టి మరీ ప్రతి ఇంటికి పంపించారని, రైతులకు రూ. 87,612 కోట్ల రుణాలు మాఫీ చేస్తానని, పొదుపు సంఘాలకు రూ.14205 కోట్ల వడ్డీ మాఫీ చేస్తానని చెప్పారని, అధికారంలోకి వచ్చాక అడ్డగోలుగా మోసం చేశారని అన్నారు. మహిళా రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ కథ దేవుడెరుగు.. విజయవాడలో ఏకంగా కాల్ మనీ సెక్స్ రాకెట్ నడిపించారని విమర్శలు చేశారు జగన్. .
2014 లో చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో హామీలను మరోసారి ప్రజలకు గుర్తు చేసి మరీ విమర్శలు ఎక్కుపెట్టారు సీఎం జగన్. ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మీ పథకం కింద రూ.25 వేలు ఖాతాల్లోకి వేస్తానన్నారని, ఒక్కరంటే ఒక్కరికైనా ఆడబ్బు జమ చేశారా అని ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వలేకపోతే ప్రతి ఇంటికీ రూ.2 వేల నిరుద్యోగభృతి అంటూ కాలం గడిపారని చెప్పారు. పాంప్లేట్లు చూపించి రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తానన్నారని, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో హైటెక్ సిటీలు కడతానన్నారని గుర్తు చేశారు. అక్కచెల్లెమ్మలకోసం కొన్ని పేజీలు పెట్టి మరీ హోల్ సేల్ గా మోసం చేశారన్నారు జగన్. ఈసారి కూడా ఇలాంటి మోసాలు రిపీట్ అవుతాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అదే కూటమి మళ్లీ మోసపు హామీలతో ప్రజల ముందుకొస్తోందని హెచ్చరించారు జగన్.