ఏపీ వైపు.. అంబానీ, అదానీ చూపు..

అనకాపల్లి అచ్యుతాపురం సెజ్‌ లో ఏటీసీ టైర్ల పరిశ్రమను ప్రారంభించిన జగన్, రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి వేగంగా జరుగుతోందని చెప్పారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ లో మూడేళ్లుగా ఏపీకి అవార్డులు రావడమే దీనికి నిదర్శనం అని అన్నారు.

Advertisement
Update:2022-08-16 16:52 IST

అంబానీ, అదానీలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారని అన్నారు సీఎం జగన్. అనకాపల్లి అచ్యుతాపురం సెజ్‌ లో ఏటీసీ టైర్ల పరిశ్రమను ప్రారంభించిన జగన్, రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి వేగంగా జరుగుతోందని చెప్పారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ లో మూడేళ్లుగా ఏపీకి అవార్డులు రావడమే దీనికి నిదర్శనం అని అన్నారు. జపాన్‌ కు చెందిన ఏటీసీ కంపెనీ 15 నెలల వ్యవధిలోనే ఏపీలో తమ శాఖను స్థాపించిందని, ఏపీలో వ్యాపార వర్గాలకు ప్రభుత్వం వెసులుబాట్లు ఇస్తోందని చెప్పారు. 15 నెలల్లోనే తొలిదశ ఉత్పత్తి ప్రారంభం కావడంతో, రెండో దశకు కూడా ఏటీసీ కంపెనీ సన్నాహాలు చేస్తోందని చెప్పారు జగన్. ప్రపంచంలోనే 5, 6 స్థానాల్లో ఉన్న యొకహొమా కంపెనీ భారత్ లో తన కార్యకలాపాలకోసం ఏపీని ఎంచుకోవడం సంతోషకరం అన్నారు.

అచ్యుతాపురంలో ప్రారంభించిన టైర్ల పరిశ్రమతో 2వేలమందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు సీఎం జగన్. ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే.. ఆ ప్రాంతంలోని విద్యావంతులకు ఉద్యోగాలు రావాలని, అప్పుడే వారంతా పేదరికం నుంచి బయటపడతారన్నారు జగన్. ఏపీలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్ల కాలంలో 98 అతి భారీ, భారీ పరిశ్రమలు ఏర్పాటయ్యాయని చెప్పారు. 39,350 కోట్ల రూపాయలు పెట్టుబడి రూపంలో వచ్చాయని అన్నారు. 60,541 మందికి ఉద్యోగావకాశాలు లభించాయని చెప్పారు. రాబోయే రెండేళ్ల కాలంలో మరో 56 పరిశ్రమలు ఏపీలో ఏర్పాటవుతాయని, వాటి ద్వారా 1,64,155 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నామని ప్రకటించారు.

దేశంతో పోలిస్తే ఏపీయే ముందు..

దేశంతో పోలిస్తే.. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి మరింత వేగంగా జరుగుతోందని అన్నారు సీఎం జగన్. ఇప్పటికే ఎగుమతుల్లో ఏపీ రికార్డులు సృష్టించిందని, ప్రతిపాదనలో ఉన్న మరో 4 పోర్ట్ లు అందుబాటులోకి వస్తే.. ఎగుమతుల్లో ఏపీ మరింత ముందుకెళ్తుందని చెప్పారు. ఏపీ సముద్ర తీరంలో ప్రతి 50కిలోమీటర్లకి ఒక ఫిషింగ్ హార్బర్ కానీ, ఒక పోర్ట్ కానీ ఉండేలా ప్రణాళిక రచించామని అన్నారు. ఇవన్నీ అందుబాటులోకి వస్తే దేశం మొత్తంనుంచి ఎగుమతి అయ్యే సరుకులో 10శాతం ఏపీనుంచే బయటకు వెళ్తుందని చెప్పారు. 3 ఇండస్ట్రియల్ కారిడార్ లు ఉన్న ఏకైక రాష్ట్రం ఏపీ అని వివరించారాయన. మీరు పరిశ్రమలు పెట్టండి, మేం అన్నిరకాలుగా మీకు తోడుంటాం.. అనే నినాదంతో ఏపీ ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలకు హామీ ఇస్తోందని చెప్పారు. గతంలో ఏపీలో పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇచ్చేవారు కాదని, చిన్నా చితకా పరిశ్రమలు నడవలేక మూతబడుతున్న పరిస్థితులు ఉండేవని.. ప్రస్తుతం లక్షకు పైగా ఎంఎస్‌ఎంఈలు రాష్ట్రంలో ఉన్నాయని చెప్పారు. 2020-21లో జాతీయ జీడీపీ గ్రోత్ రేటు 8.9 శాతం ఉంటే.. ఏపీ గ్రోత్ రేట్ 11.43 శాతం నమోదైందని అన్నారు.

Tags:    
Advertisement

Similar News