అవి పేపర్ పెట్టుబడులు కావు.. ప్రతిపక్షాలకు జగన్ సమాధానం
ఈ సమీక్ష ద్వారా ప్రతిపక్షాలకు కూడా గట్టి సందేశం పంపించారు సీఎం జగన్. విశాఖ సమ్మిట్ లో కుదిరిన ఒప్పందాలన్నీ కార్యరూపం దాలుస్తున్నట్టు సమాధానమిచ్చారు.
ఆమధ్య విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఏపీకి తరలి వచ్చాయని చెప్పుకుంది వైసీపీ. అయితే టీడీపీ నుంచి కౌంటర్లు మాత్రం ఆగలేదు. అవన్నీ పేపర్ పై కనిపించేవని, ఒక్క పరిశ్రమ కూడా ఏపీకి రాదని వెటకారమాడాయి. ఆ తర్వాత ప్రభుత్వం కూడా ఎక్కడా వాటిపై సమీక్షలు పెట్టలేదు, గ్లోబల్ సమ్మిట్ లో వచ్చిన ఫలానా పరిశ్రమకు శంకుస్థాపన జరిగిందనే ప్రచారం కూడా లేదు. ఈ దశలో ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ పెట్టుబడులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.
విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ద్వారా 387 ఒప్పందాలు కుదుర్చుకున్నామని ఈ సందర్భంగా సీఎంకు వివరించారు అధికారులు. పరిశ్రమలు వాణిజ్య శాఖ తరపున 100 ఒప్పందాలు కుదిరాయని, ఇందులో 13 ఒప్పందాలు ఇప్పటికే వాస్తవ రూపం దాల్చాయని, రూ.2,739 కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. ఈ ఒప్పందాలు అమలులోకి రావడంతో 6,858 మందికి ఉద్యోగాలు లభించాయన్నారు. 2024 జనవరినాటికి 38 కంపెనీలకు సంబంధించి పనులు ప్రారంభమవుతాయన్నారు. 2024 మార్చిలోపు మరో 30 కంపెనీలు పనులు పూర్తిచేసుకుని ఉత్పత్తిని ప్రారంభిస్తాయని వెల్లడించారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా కుదుర్చుకున్న ఒప్పందాలన్నీ 2024 ఫిబ్రవరి నాటికి అమలులోకి రావాలని అధికారులకు సూచించారు సీఎం జగన్.
విద్యుత్ ప్రాజెక్టులు, ఐటీ, ఐటీ ఆధారిత సర్వీసులు, ఎలక్ట్రానిక్స్ రంగానికి సంబంధించిన ఒప్పందాలు కూడా దాదాపుగా అమలులోకి వస్తున్నాయని తెలిపారు అధికారులు. ఐటీ తదితర రంగాల్లో 88 ఒప్పందాలు చేసుకోగా, అందులో 85శాతం కంపెనీలు నిర్మాణ పనులు ప్రారంభించడమో, లేదా ఉత్పత్తికి సిద్ధం కావడమో జరిగిందని వెల్లడించారు. దాదాపుగా రూ.38,573 కోట్ల పెట్టుబడులు వాస్తవరూపం దాల్చాయని చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్, పశుసంవర్థక శాఖ, టూరిజం రంగాల్లో ఒప్పందాలపైనా సీఎం సమీక్షించారు.
ఈ సమీక్ష ద్వారా ప్రతిపక్షాలకు కూడా గట్టి సందేశం పంపించారు సీఎం జగన్. విశాఖ సమ్మిట్ లో కుదిరిన ఒప్పందాలన్నీ కార్యరూపం దాలుస్తున్నట్టు సమాధానమిచ్చారు. వీలైనంత త్వరగా ఒప్పందాలను అమలులో పెట్టాలని, వాటి ద్వారా వచ్చే ఫలితాలు ప్రజలకు తెలియజేయాలని అధికారులకు సూచించారు.