గడప గడపపై సమీక్ష.. వైసీపీ ఎమ్మెల్యేల భవిష్యత్తు తేలేది రేపే
రేపు మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇన్ చార్జ్ లు, కోఆర్డినేటర్లతో జగన్ సమావేశం కాబోతున్నారు. ఫైనల్ సమీక్షలో ఎవరికి తలంటుతారు, ఎవరిని మెచ్చుకుంటారనేది తేలిపోతుంది.
వైసీపీ ఎమ్మెల్యేలకు సీఎం జగన్ ఓ టాస్క్ ఇచ్చారు. గడప గడపకు మన ప్రభుత్వం అంటూ జనంలోకి వెళ్లాలన్నారు. ఆ కార్యక్రమం ఎవరు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేస్తే వారికే టికెట్లు కేటాయిస్తానని బహిరంగంగా చెప్పేశారు. ఆ తర్వాత వరుసగా సమీక్షలు జరిపి, సరిగా చేయనివారిని సుతిమెత్తగా హెచ్చరించారు. ఇప్పుడిక ఎన్నికలకు టైమ్ దగ్గరకు రావడంతో ఫైనల్ సమీక్షకు ఆయన సిద్ధమయ్యారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇన్ చార్జ్ లు, కోఆర్డినేటర్లతో జగన్ సమావేశం కాబోతున్నారు. ఫైనల్ సమీక్షలో ఎవరికి తలంటుతారు, ఎవరిని మెచ్చుకుంటారనేది తేలిపోతుంది.
గడప గడపకు సరిగ్గా వెళ్లలేని వారికి గతంలో కూడా వార్నింగ్ ఇచ్చారు సీఎం జగన్. చాలామంది ఆ తర్వాత సెట్ రైట్ అయ్యారు. అప్పటి వరకు లైట్ తీసుకున్న సీనియర్లు కూడా కాలు కదిపారు. గడప గడపకు తిరుగుతున్నారు, ప్రజల్లోనే ఉంటున్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే జగన్ కు ఐ ప్యాక్ టీమ్ నివేదికలు అందించింది. ఆ నివేదికలతో సీఎం సమీక్షకు రెడీ అయ్యారు.
చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏపీ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. టీడీపీ-జనసేన పొత్తు ఖాయమైపోయింది. బీజేపీ సీన్ లో ఉంటుందా లేదా అనే విషయం పక్కనపెడితే.. వైరి వర్గం కలసి వస్తే ఎలా కట్టడి చేయాలనే విషయంలో వైసీపీ మంత్రాంగం రచిస్తోంది. జగన్ ధీమా అంతా నవరత్నాలపైనే. అదే సమయంలో ఎమ్మెల్యేలకు ఇచ్చిన టాస్క్ విషయంలో కూడా జగన్ కి నమ్మకం ఉంది. ఎమ్మెల్యేలు నిత్యం ప్రజల్లో ఉండి, సమస్యలు పరిష్కరిస్తుంటే ఇక జనం ఓటు వేయకుండా ఎక్కడికిపోతారనేది ఆయన ఆలోచన. మరోవైపు జగన్ కూడా నేరుగా రంగంలోకి దిగాలనుకుంటున్నారు. ప్రజల పట్ల తనకున్న నిబద్ధతను చూపెడుతూ ‘ప్రజా ఆశీర్వాద యాత్ర’ చేపట్టాలని నిర్ణయించారు. ఈ యాత్రపై కూడా రేపు ఎమ్మెల్యేల సమావేశంలో క్లారిటీ ఇస్తారు జగన్.
♦