మళ్లీ నేను వస్తా.. ఆ మాట నాకు వినపడకూడదు

తుపాను ప్రభావం తగ్గిన తర్వాత తాను మళ్లీ జిల్లాల పర్యటనకు వస్తానని, అప్పుడు అధికారుల పనితీరుపై ప్రజలు సంతోషం వెలిబుచ్చాలని.. ఆ దిశగా అధికారులు పని చేయాలని సూచించారు సీఎం జగన్.

Advertisement
Update:2023-12-04 16:41 IST

మిచౌంగ్ తుపాను తీవ్ర ప్రభావం నేపథ్యంలో సీఎం జగన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 8 జిల్లాల కలెక్టర్లకు ఆయన కీలక సూచనలు చేశారు. నష్టపరిహారం కూడా ముందుగానే ప్రకటించారు జగన్. వర్షాలకు ఇళ్లు, గుడిసెలు దెబ్బతింటే రూ.10 వేలు ఆర్థిక సాయం అందించాలని ఆదేశించారు. తుపాను తగ్గిన తర్వాత పంట నష్టం అంచనాలు రూపొందించి పరిహారం ఇవ్వాలని సూచించారు. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా అండగా నిలబడాలని చెప్పారు జగన్. పంట కోయని చోట్ల అలాగే ఉంచేలా చర్యలు తీసుకోవాలని, ఇప్పటికే కోసిఉంటే ధాన్యాన్ని యుద్ధప్రాతిపదికన కొనుగోలు చేయాలని ఆదేశించారు.


తుపాను ప్రభావం తగ్గిన తర్వాత తాను మళ్లీ జిల్లాల పర్యటనకు వస్తానని, అప్పుడు అధికారుల పనితీరుపై ప్రజలు సంతోషం వెలిబుచ్చాలని.. ఆ దిశగా అధికారులు పని చేయాలని సూచించారు సీఎం జగన్. సహాయం అందలేదని, తమని బాగా చూసుకోలేదన్న మాట బాధితుల నుంచి వినపడకూడదన్నారు. తుపాన్లను ఎదుర్కోవడంలో మన యంత్రాంగానికి మంచి అనుభవం ఉందని, అప్రమత్తంగా ఉంటూనే యంత్రాంగం సీరియస్‌గా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇప్పటికే జిల్లాల కలెక్టర్లకు నిధులు విడుదల చేశామని, ప్రతి జిల్లాకు సీనియర్లను ప్రత్యేక అధికారులుగా నియమిస్తున్నామని చెప్పారు. ఎలాంటి ప్రాణనష్టం లేకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందన్నారు జగన్. పశువులకు కూడా ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

తుపాను ప్రభావం ఉన్న ప్రాంతాల నుంచి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు జగన్. ఇప్పటికే 308 శిబిరాల ఏర్పాటుకు సురక్షిత ప్రాంతాలను గుర్తించినట్టు అధికారులు చెప్పారని, అవసరమైన చోట వెంటనే శిబిరాలను తెరిచి ప్రజలను అక్కడకు తరలించాలన్నారు. ఇతర రాష్ట్రాలకు లేని, మనకు మాత్రమే ఉన్న మరో బలం గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ అని అన్నారు జగన్. విలేజ్‌ క్లినిక్స్‌, ఆర్బీకేలు కూడా మనకు ఉన్నాయని ఈ యంత్రాంగాన్ని బాగా వినియోగించుకోవాలని చెప్పారు జగన్. పునరావాస శిబిరాల నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు ప్రజలు చిరునవ్వుతో వెళ్లాలని చెప్పారు. బాధితులు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు, కుటుంబం ఉంటే వారికి రూ.2500ఇవ్వాలని సూచించారు. ఇళ్లలోకి నీళ్లు చేరిన వారికి 25 కేజీల బియ్యం, కందిపప్పు, పామాయిల్‌, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు కేజీ చొప్పున అందించాలన్నారు జగన్. 


Tags:    
Advertisement

Similar News