సీఏఏను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశాం..

తాను పొత్తుల కోసం ఎప్పుడూ ఎవరి వద్దకూ వెళ్లలేదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కన్నా ప్రధాని నరేంద్ర మోడీ వ్యక్తిగతంగా మంచివారని ఆయన అన్నారు.

Advertisement
Update: 2024-05-03 10:59 GMT

తాను కేంద్రంలోని బీజేపీకి అంశాలవారీగా మాత్రమే మద్దతు ఇచ్చానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చెప్పారు. సీఏఏను వ్యతిరేకిస్తూ తమ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింద‌ని ఆయన గుర్తు చేశారు. టైమ్స్ నౌకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన విధానాలను స్పష్టంగా వివరించారు. ప్రత్యేక హోదాపై అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాజీపడ్డారని ఆయన చెప్పారు. కేంద్రంలో సంకీర్ణం వచ్చి ఉంటే తాను తప్పకుండా ప్రత్యేక హోదాను సాధించి ఉండేవాడినని ఆయన చెప్పారు.

బీజేపీ మీతో కాకుండా టీడీపీతో పొత్తు పెట్టుకోవడంపై మీరేమంటారని ప్రశ్నిస్తే అది వారి ఇష్టమని సమాధానమిచ్చారు. తాను పొత్తుల కోసం ఎప్పుడూ ఎవరి వద్దకూ వెళ్లలేదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కన్నా ప్రధాని నరేంద్ర మోడీ వ్యక్తిగతంగా మంచివారని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయని, రెండు ప్రాంతీయ పార్టీల మధ్య మాత్రమే పోరాటమని ఆయన చెప్పారు.

రాష్ట్రంలో ముఖాముఖి పోటీ మాత్రమే ఉందని ఆయన చెప్పారు. కాంగ్రెస్‌కు నోటాకు వచ్చే ఓట్ల కన్నా ఒక్క ఓటు కూడా ఎక్కువ రాదని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో తన ప్రభుత్వం పనితీరుపై మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయని, తాను చేసిన పనులను మెచ్చితే తనకు ప్రజలు ఓటు వేస్తారని ఆయన చెప్పారు. తమ పార్టీ 50 శాతం కన్నా ఎక్కువ ఓట్లు సాధిస్తుందని ఆయన చెప్పారు.

2014 ఎన్నికల్లో టీడీపీ అచ్చు వేసి పంపిణీ చేసిన హామీల పత్రాన్ని తాను చూపిస్తూ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా మోసం చేశాడనే విషయాన్ని ప్రజలకు చెప్పుతున్నానని ఆయన చెప్పారు. ఆ పత్రంపై ముగ్గురి ఫొటోలు కూడా ఉన్నాయని, ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం వల్లనే చంద్రబాబు అధికారం కోల్పోయారని ఆయన అన్నారు. 2014లో కూటమి కట్టిన పార్టీలే మ‌ళ్లీ ఇప్పుడు కూటమి కట్టాయని, అదే కూటమి హామీలు కురిపించిందని, వాటిని ప్రజలు ఎలా నమ్ముతారని ఆయన అన్నారు. 2019లో తమ పార్టీ ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశామని ఆయన చెప్పారు.

Tags:    
Advertisement

Similar News