జగన్ బ్యాండేజ్ తీసేశారు.. అయినా ఏడుపేనా..?
జగన్ గాయం మాయమైందంటూ నారా లోకేష్ కూడా తన ట్విట్టర్లో విషపు రాతలు రాశారు. దానికి వైసీపీ అధికారికంగా కౌంటర్ ఇచ్చింది.
జగన్ బ్యాండేజ్ వేసుకుంటే ఒక ఏడుపు..
దెబ్బ పూర్తిగా మానే వరకు దాన్ని అలానే ఉంచుకుంటే మరో ఏడుపు..
గాయం మానిన తర్వాత దాన్ని తీసేస్తే ఇంకో ఏడుపు..
నిన్నటి వరకు సీఎం జగన్ బ్యాండేజ్ వేసుకున్నారని ఎల్లో మీడియా తెగ ఇదైపోయింది. ఎన్నికల వరకు ఆ బ్యాండేజ్ ఆయన తీయరని, సింపతీకోసం వాడుకుంటారని విషం చిమ్మింది. చంద్రబాబు కూడా పదే పదే తన ప్రసంగాల్లో బ్యాండేజ్ అంశాన్నే ప్రస్తావించారు. ఇక వైఎస్ వివేకా కుమార్తె సునీత అయితే డాక్టర్ గా ఓ సలహా అంటూ మరింత వెటకారం చేశారు. ఈ వెటకారాలన్నిటినీ పక్కన పెడితే ఈరోజు సీఎం జగన్ బ్యాండేజ్ తీసేశారు. మేనిఫెస్టో ప్రకటన సమయంలో ఆయన తలకు బ్యాండేజ్ లేదు. అయినా కూడా ఎల్లో మీడియా, టీడీపీ కొత్త ఏడుపు మొదలు పెట్టాయి. జగన్ బ్యాండేజ్ తీసేశారంటూ టీడీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ కడుపుమంట ట్వీట్ బయటకొచ్చింది.
దెబ్బ ఆనవాళ్లు లేవట..
ఈరోజు మేనిఫెస్టో ప్రకటించే సమయంలో జగన్ బ్యాండేజ్ తీసేసి బయటకు వచ్చారు. మరో రెండురోజులపాటు ఆయన జనంలోకి వచ్చే అవకాశం లేదు. అంటే ఇన్ఫెక్షన్ సోకే అవకాశం తక్కువ. అందుకే ఆయన బ్యాండేజ్ తీసేసి బయటకు వచ్చారు. అయితే ఇక్కడ టీడీపీ, ఎల్లో మీడియా మళ్లీ కోడిగుడ్డుపై ఈకలు పీకడం మొదలు పెట్టాయి. జగన్ కి అయిన గాయం కనపడటం లేదట. తల మీద మచ్చ లేదని, కుట్లు వేసిన ఆనవాళ్లు కూడా లేవని ట్విట్టర్లో నీఛంగా రాసుకొచ్చింది.
జగన్ గాయం మాయమైందంటూ నారా లోకేష్ కూడా తన ట్విట్టర్లో విషపు రాతలు రాశారు. దానికి వైసీపీ అధికారికంగా కౌంటర్ ఇచ్చింది. జగన్ గాయం స్పష్టంగా కనపడుతోందని, లోకేష్ కూడా వైసీపీ మేనిఫెస్టో విడుదలను ఆసక్తిగా తిలకించడం సంతోషం అని వైసీపీ ట్విట్టర్ ద్వారా బదులిచ్చింది.
రాయిదాడి జరిగినప్పుడు జగన్ కు రక్తగాయం అయింది. ఆ రక్తాన్ని తుడిచి అప్పటికప్పుడు గాయానికి ఫస్ట్ ఎయిడ్ చేశారు. ఆ తర్వాత విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో కుట్లు వేశారు. ఒకరోజు రెస్ట్ తీసుకుని తర్వాత ఆయన బస్ యాత్రల్లో పాల్గొన్నారు. బస్ యాత్ర పూర్తవడంతో పులివెందులలో నామినేష్ వేసి, ఈరోజు మేనిఫెస్టో విడుదల చేశారు. మరో రెండురోజులపాటు ఆయన విశ్రాంతి తీసుకుంటారు కాబట్టి, ఈరోజు బ్యాండేజ్ తీసివేశారు. చివరకు దాన్ని కూడా టీడీపీ రాజకీయం చేయాలని చూస్తోంది. తన నీఛబుద్ధిని మరోసారి బయటపెట్టుకుంది.