నలుగురు ధనికుల, దత్త పుత్రుడి పభుత్వం కాదిది - జగన్

గత ప్రభుత్వంలో దొరికింది దోచుకోండి.. దాచుకోండి.. పంచుకోండి అన్నట్టుగా వ్యవహారం ఉండేదన్నారు. ఈ ప్రభుత్వంలో అలాంటి దోపిడీ విధానాలకు చరమగీతం పాడామన్నారు.

Advertisement
Update:2022-07-15 14:41 IST

విశాఖపట్నంలో నాలుగో విడత వైయస్సార్ వాహన మిత్ర పథకంలో భాగంగా డ్రైవర్ల బ్యాంకు ఖాతాల్లోకి బటన్ నొక్కి నిధులు జమ చేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రతిపక్షాలపై మరోసారి విరుచుకుపడ్డారు. తమది నలుగురు ధనికుల కోసం, దత్తపుత్రుడి కోసం నడిచే ప్రభుత్వం కాదని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వంలో దొరికింది దోచుకోండి.. దాచుకోండి.. పంచుకోండి అన్నట్టుగా వ్యవహారం ఉండేదన్నారు. ఈ ప్రభుత్వంలో అలాంటి దోపిడీ విధానాలకు చరమగీతం పాడామన్నారు.

నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే నగదు జమ చేస్తూ మధ్యలో అవినీతికి ఆస్కారం లేకుండా చేస్తున్నామని వివరించారు. గత ప్రభుత్వం తరహాలో ఈ ప్రభుత్వంలో దోచుకోవడం లేదు.. పంచుకోవడం లేదని సీఎం వ్యాఖ్యానించారు. అయినా సరే చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 కలిసి దుష్టచతుష్టయంగా మారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు.

అయినా సరే ప్రజల ఆశీస్సులు, దేవుడి దీవెనలు ఉన్నంతకాలం తనను ఎవరు ఏమి చేయలేరని సీఎం జ‌గ‌న్‌ ధీమా వ్యక్తం చేశారు. తనకు నిబద్ధత, నిజాయితీ ఉందని ఆయన వ్యాఖ్యానించారు. మూడేళ్ల కాలంలో ఎక్కడా లంచాలకు తావులేకుండా, కులం చూడకుండా, మతం చూడకుండా, రాజకీయ పార్టీలు కూడా చూడకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి 1.65 లక్షల కోట్ల రూపాయలు జమ చేశామని ముఖ్యమంత్రి వివరించారు.

ఈ విషయాలన్నీ ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు. అప్పులు ఎక్కువ చేస్తున్నారంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు తమ ప్రభుత్వం చేస్తున్న అప్పులు కూడా చాలా తక్కువ అని ముఖ్యమంత్రి వివరించారు.

వైయ‌స్సార్‌ వాహన మిత్ర పథకంలో భాగంగా ఒక్కో లబ్ధిదారునికి రూ.10వేల చొప్పున మొత్తం రూ.261.51 కోట్లను వారి ఖాతాల్లో జమచేశారు సీఎం. బటన్ నొక్కి నిధులు జమ చేసిన వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్కడికి వచ్చిన ఆటో డ్రైవర్లతో ముచ్చటించారు. వారితో కలిసి ఫొటోలు దిగారు. కొద్దిసేపు జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఆటో నడిపారు.

Tags:    
Advertisement

Similar News