ప్రచారంలో పంథా మార్చిన జగన్..
జనంలో కొన్ని అపోహలున్నాయి. అందుకే సీఎం జగన్ నేరుగా రంగంలోకి దిగారు. తన పర్యటనల్లో ఆ తప్పుడు ప్రచారాన్ని ఖండించడానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు.
ఏపీ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. మరో 9 రోజుల్లో ఎన్నికలు జరుగుతాయి. ఈదశలో సీఎం జగన్ ప్రచారంలో తన పంథా మార్చారు. ఇప్పటి వరకు తాను ఏం చేశాను, తనకు ఓటు వేస్తే ఏం జరుగుతుంది అనే విషయాలపై ఆయన ఎక్కువ ఫోకస్ పెట్టారు. తాజాగా ఆయన తన ప్రసంగంలో టీడీపీ దుష్ప్రచారాలను ప్రజలకు వివరించి చెబుతున్నారు. పొరపాటున కూడా వారి మాటలు నమ్మొద్దని, చంద్రబాబు మాయలో పడొద్దని ప్రజలకు సూచిస్తున్నారు జగన్.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
ప్రస్తుతం టీడీపీ, ఎల్లో మీడియా బలంగా హైలైట్ చేస్తున్న పాయింట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ యాక్ట్ ద్వారా ప్రజల ఆస్తుల్ని ప్రభుత్వం లాగేసుకుంటుందనే భయాన్ని వారికి నూరిపోస్తోంది. ఇలాంటి భయం ఉంటే.. సంక్షేమ పథకాలు గుర్తు రావు. అందుకే తెలివిగా చంద్రబాబు ఈ అబద్ధాన్ని నిజం అనుకునేలా పదే పదే అదే విషయాన్ని చెబుతున్నారు. తాను అధికారంలోకి వస్తే రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అనే ఫైల్ పై పెడతానని అంటున్నారు. పవన్ కల్యాణ్ కూడా తన ప్రసంగాల్లో పదే పదే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటూ ఆరోపిస్తున్నారు. ఈ దుష్ప్రచారాన్ని వైసీపీ నేతలు ఖండిస్తున్నా.. జనంలో కొన్ని అపోహలున్నాయి. అందుకే సీఎం జగన్ నేరుగా రంగంలోకి దిగారు. తన పర్యటనల్లో ఆ తప్పుడు ప్రచారాన్ని ఖండించడానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. తన సంక్షేమ పథకాల గురించి వివరిస్తూనే చంద్రబాబు దుష్ప్రచారాలను ఖండిస్తున్నారు జగన్.
తనకు భూములు ఇవ్వడమే తెలుసని, లాక్కోవడం తెలియదని అంటున్నారు సీఎం జగన్. హిందూపురంలో జరిగిన మీటింగ్ లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి వివరించారు. దాని ద్వారా ఎవరీకీ హాని జరగదన్నారు జగన్. ప్రజలకు మేలు జరిగే నిర్ణయాలు తీసుకున్నా కూడా తమపై బురదజల్లుతున్నారని, ప్రజల్ని తప్పుదోవపట్టిస్తున్నారని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. టీడీపీ మేనిఫెస్టోని ఎవరూ నమ్మొద్దని, కూటమి మాయలో పడొద్దని, 2014లాగా మరోసారి మోసపోవద్దని చెప్పారు జగన్.