విరామం తర్వాత జగన్ సభ.. నేడు కీలక అంశాల ప్రస్తావన
ఈ సభలో జగన్ పలు కీలక అంశాలు ప్రస్తావించే అవకాశం ఉంది. వాలంటీర్లకు రూ.10వేల జీతం అంటూ చంద్రబాబు చేసిన ప్రకటనకి కూడా జగన్ కౌంటర్ ఇస్తారని తెలుస్తోంది.
కావలి, కొనకనమిట్ల సభల తర్వాత ఒకరోజు గ్యాప్ తీసుకుని సీఎం జగన్ నేడు పల్నాడు ప్రాంతంలో పర్యటిస్తున్నారు. అయ్యప్పనగర్ లో ఈ సాయంత్రం భారీ బహిరంగ సభ జరుగుతుంది. ఈ సభలో జగన్ పలు కీలక అంశాలు ప్రస్తావించే అవకాశం ఉంది. వాలంటీర్లకు రూ.10వేల జీతం అంటూ చంద్రబాబు చేసిన ప్రకటనకి కూడా జగన్ కౌంటర్ ఇస్తారని అంటున్నారు. ఇంటింటికీ కేజీ బంగారం, బెంజ్ కారు ఇస్తానని చంద్రబాబు మాయమాటలు చెబుతారని గతంలోనే జగన్ హింటిచ్చారు. అదే స్టైల్ లో చంద్రబాబు మోసాలకు తెరతీస్తున్నారు. ఆ మోసాల్ని మరోసారి ప్రజలకు ముఖ్యమంత్రి వివరించబోతున్నారు.
మేమంతా సిద్ధం బస్ యాత్ర 12వరోజుకి చేరుకుంది. ఉగాది సందర్భంగా యాత్రకు స్వల్ప విరామం ఇచ్చిన జగన్.. ఈరోజు గంటావారిపాలెం రాత్రి బస నుంచి బయలుదేరుతారు. పుట్టవారిపాలెం, సంతమాగులూరు క్రాస్, రొంపిచర్ల క్రాస్, విప్పెర్ల, నెకరికల్లు మీదుగా దేవరంపాడు క్రాస్ దగ్గరకు చేరుకుని మధ్యాహ్న భోజనం చేస్తారు. తర్వాత కొండమోడు, పిడుగురాళ్ల బైపాస్ మీదుగా మధ్యాహ్నం 3.30 గంటలకు అయ్యప్పనగర్ చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
సభ పూర్తయిన తర్వాత కొండమోడు జంక్షన్, అనుపాలెం, రాజుపాలెం, రెడ్డిగూడెం మీదుగా ధూళిపాళ్ళకు చేరుకుంటారు జగన్. అక్కడ రాత్రి బస ఏర్పాట్లు జరిగాయి. రోజు రోజుకీ యాత్ర ఫుల్ జోష్ తో సాగిపోతోంది. చంద్రబాబులా పాతపాటే పాడకుండా.. ప్రతి సభలోనూ ప్రజల్ని ఆకట్టుకునేలా జగన్ ప్రసంగం సాగుతోంది. ప్రజలతో ముఖాముఖి, రోడ్ షో లు కూడా ఆసక్తిగా సాగుతున్నాయి. తన స్టార్ క్యాంపెయినర్లు వీరేనంటూ ప్రజలతో దిగిన ఫొటోలను ప్రతిరోజూ జగన్ తన వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేస్తున్నారు. కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు.