వైఎస్‌ జగన్‌ సోషల్‌ ఇంజనీరింగ్‌.. శ్రీమంతులపై టిప్పర్‌ లారీ డ్రైవర్‌, కూలీలు..

2019 ఎన్నికల్లో కూడా అణగారినవర్గాల నుంచి వచ్చినవారికి టికెట్లు ఇచ్చారు. అది ఫలితం ఇచ్చింది. వైఎస్సార్ సీపీ అనూహ్యంగా 151 అసెంబ్లీ సీట్లలో గెలిచింది. ఈసారి కూడా ఆయన డ్రైవర్లకు, కూలీలకు టికెట్లు ఇచ్చారు

Advertisement
Update:2024-03-22 12:46 IST

ప్ర‌తి ఎన్నిక‌ల్లోనూ అభ్య‌ర్థుల ఎంపిక‌, టికెట్ల కేటాయింపులో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్ తన సోషల్‌ ఇంజనీరింగ్‌ పంథాను కొన‌సాగిస్తున్నారు. ఈ ఎన్నికల్లో కూడా ఆ సంప్రదాయాన్ని పాటించారు. ఈ ఎన్నికల్లో అత్యంత సామాన్యులను కోట్లకు పడగలెత్తినవారిపై పోటీకి దించుతున్నారు. ఎన్నికలు కోట్లాది రూపాయల జూదంగా మారిన ఈ పరిస్థితిలో ఆయన ఆ సాహసం చేస్తున్నారు.

రాజకీయాల్లోకి అడుగుపెట్టి, ఎన్నికల్లో పోటీ చేస్తామని ఏ రోజు కూడా ఊహించనివారికి జగన్‌ ఎన్నికల్లో టికెట్లు ఇచ్చారు. రాజకీయ పార్టీలు సంపన్నులకు, వ్యాపారవేత్తలకు, ఎన్ఆర్ఐల‌కు, వైద్యులకు, న్యాయవాదులకు టికెట్లు ఇస్తున్న ఈ కాలంలో కూడా జగన్‌ సామాన్యులను బరిలోకి దింపుతున్నారు.

ఆయన 2019 ఎన్నికల్లో కూడా అణగారినవర్గాల నుంచి వచ్చినవారికి టికెట్లు ఇచ్చారు. అది ఫలితం ఇచ్చింది. వైఎస్సార్ సీపీ అనూహ్యంగా 151 అసెంబ్లీ సీట్లలో గెలిచింది. ఈసారి కూడా ఆయన డ్రైవర్లకు, కూలీలకు టికెట్లు ఇచ్చారు. దీన్ని విప్లవాత్మకమైన అడుగుగా భావించాల్సి వుంటుంది.

అత్యంత సామాన్యుడు, వైఎస్సార్ సీపీ కార్యకర్త, గోల్డ్‌స్మిత్‌ ఖలీల్‌ అహ్మద్‌కు నెల్లూరు సిటీ అసెంబ్లీ సీటు ఇచ్చారు. నారాయణ ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ అధినేత, అత్యంత ధనవంతుడు పి. నారాయణను ఆయన ఎదుర్కుంటున్నారు. సాధారణమైన రైతు సార్నాల తిరుపతి రావు వైఎస్సార్ సీపీ తరఫున మైలవరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. తిరుపతి రావు పారిశ్రామికవేత్త వసంత కృష్ణప్రసాద్‌ను ఎదుర్కుంటున్నారు. ఈర లక్కప్పను మడకశిర నుంచి, టిప్పర్‌ లారీ డ్రైవర్‌ వీరాంజనేయులును శింగనమల నుంచి అసెంబ్లీ బరిలోకి దింపుతున్నారు.

కూలీ పనిచేస్తున్న లక్కప్ప వైఎస్‌ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో వచ్చిన ఇందిరమ్మ ఇంటిలో ఉంటున్నారు. మడకశిర నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. తనకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వస్తుందని ఆయన ఏ రోజు కూడా అనుకుని ఉండరు. తనను ఆయన జగనన్న ప్రతినిధిగా చెప్పుకుంటున్నారు.

న్యాయవాది గూడూరి ఉమాబాలను నర్సాపురం లోక్‌సభ సీటుకు అభ్యర్థిగా ఎంపిక చేశారు. బహుశా ఆమె రఘురామ కృష్ణంరాజుపై పోటీ పడాల్సి ఉంటుంది. రఘురామ కృష్ణంరాజు గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా జగన్‌ తన మార్కు సోషల్‌ ఇంజనీరింగ్‌ విధానాన్ని అనుసరించారు. చాలా మంది పేదలు, వాలంటీర్లు సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. చాలా మంది వాలంటీర్లు కౌన్సిలర్లు, కార్పోరేటర్లు, మేయ‌ర్లు అయ్యారు.

ఉదాహరణకు, వడ్రంగి పనిచేసే ఎస్‌ ఆముద చిత్తూరు మేయర్‌ అయ్యారు. శిరీష తిరుపతి మేయర్‌గా ఎన్నికయ్యారు. ఆమె మామ మున్సిపల్‌ కార్యాలయంలో అటెండర్‌. కూరగాయలు అమ్ముకుని జీవించే ఎస్‌కె బాషా రాయచోటి మున్సిపల్‌ చైర్మన్‌ అయ్యారు. తోపుడుబండి వ్యాపారి తలారి రాజ్‌కుమార్‌ కల్యాణదుర్గం మున్సిపల్‌ చైర్మన్‌గా ఎన్నికయ్యారు.

టీడీపీ, జనసేన అందుకు విరుద్ధంగా సంపన్నులకు, పారిశ్రామికవేత్తలకు, అగ్రకులాలవారికి టికెట్లు ఇచ్చాయి.. చంద్రబాబు ఇప్పటి వరకు ప్రకటించిన అభ్యర్థుల్లో ఎక్కువగా తన సామాజికవర్గానికి, సంపన్న వర్గానికి, ఇతర బలమైన వర్గాల‌కు చెందినవారికే టికెట్లు ఇచ్చారు.

Tags:    
Advertisement

Similar News