నేను ఒంటరిని కాదు.. నా బలం బలగం మీరే
పొరపాటున వైరి వర్గానికి ఓటు వేస్తే.. గత ఎన్నికల్లో పెట్టెలో బంధించిన చంద్రముఖి మళ్లీ నిద్రలేస్తుందని, సైకిల్ ఎక్కి టీ గ్లాస్ పట్టుకుని పేదల రక్తం తాగేందుకు ‘‘లక లక’’ అంటూ ప్రతి ఇంటికి వస్తుందని అన్నారు జగన్.
ఎన్నికల బరిలో తాను ఒంటరిని కాదని, తన సైన్యం, బలం.. దేవుడు, ప్రజలేనని అన్నారు సీఎం జగన్. మీరే నా బలం, నా బలగం.. నేను సిద్ధం, మీరు సిద్ధమా అంటూ దెందురూలు సభలో కార్యకర్తల్ని ఉత్సాహపరిచారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 57 నెలల్లో 124సార్లు ప్రజల సంక్షేమం కోసం బటన్ నొక్కానని 2లక్షల 55వేల కోట్ల రూపాయలను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశానని వివరించారు. లంచాలకు తావులేని, వివక్షకు చోటు లేని పాలన తీసుకొచ్చానన్నారు. లబ్ధిదారులే తన తరపున స్టార్ క్యాంపెయినర్లు కావాలని.. ప్రతి ఇంటికీ వెళ్లి జగనన్న కోసం రెండు బటన్లు నొక్కాలంటూ పిలుపునివ్వాలన్నారు.
వైరి వర్గానికి ఉన్న సైన్యం వారి పొత్తులు, ఎల్లో పత్రికలు, ఎల్లో టీవీలయితే.. తనకున్న తోడు తన ధైర్యం, తన బలం.. పైనున్న దేవుడు, ఇక్కడ ఉన్న ప్రజలేనన్నారు సీఎం జగన్. నాయకుడిమీద నమ్మకం నుంచి పుట్టిన సైన్యం తనది అన్నారు. జరగబోయే ఎన్నికల రణ క్షేత్రంలో ప్రజలంతా కృష్ణావతారంలో కృష్ణుడి పాత్ర పోషించాలని, తాను అర్జునిడిని అవుతానని.. ప్రజలకు చేసిన మంచిని అస్త్రాలుగా మలచుకొని కౌరవ సైన్యంపై యుద్ధం చేద్దామని పిలుపునిచ్చారు జగన్.
వైసీపీకి ఓటు వేయకపోతే.. సంక్షేమ పథకాలను ప్రజలే వద్దనుకున్నట్టవుతుందని చెప్పారు సీఎం జగన్. పొరపాటున వైరి వర్గానికి ఓటు వేస్తే.. గత ఎన్నికల్లో పెట్టెలో బంధించిన చంద్రముఖి మళ్లీ నిద్రలేస్తుందని, సైకిల్ ఎక్కి టీ గ్లాస్ పట్టుకుని పేదల రక్తం తాగేందుకు ‘‘లక లక’’ అంటూ ప్రతి ఇంటికి వస్తుందని అన్నారు. అబద్ధాలతో, మోసాలతో ఓ డ్రాకులా మాదిరిగా తలుపు తట్టి ప్రజల రక్తం తాగుతుందన్నారు. 2024 ఎన్నికల్లో జగనన్నకు ఓటేస్తే.. ఆ చంద్రముఖి బెడద శాశ్వతంగా ఉండదని.. చంద్రగ్రహణాలు కూడా ఉండవని భరోసా ఇచ్చారు. చంద్రబాబుపై ఓ రేంజ్ లో సెటైర్లు పేల్చారు.
మహానేత వైఎస్సార్ అడుగుజాడల్లో నడుస్తూ పాలన అందిస్తున్నాని చెప్పారు సీఎం జగన్. పెత్తందార్లు దాడి చేయడానికి రెడీగా ఉన్నారని, వారికి అవకాశం ఇవ్వొద్దని సూచించారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ప్రజలకు ఏం చేశారని నిలదీశారు. ఏనాడైనా ఒక్క రూపాయి అయినా నేరుగా లబ్ధిదారులకు చేరవేశారా అన్నారు. మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమా! అంటూ కార్యకర్తల్ని ఉత్సాహపరిచారు జగన్. దుష్టచతుష్టయంపై యుద్ధానికి మీరు సిద్ధమా! పేదల భవిష్యత్‌ను కాటేసే ఎల్లో వైరస్‌పై యుద్ధానికి మీరు సిద్ధమా! అంటూ సభను హోరెత్తించారు.