దేవతల యజ్ఞాన్ని రాక్షసులు అడ్డుకుంటున్నారు -జగన్

ప్రజల సొమ్ముతో పేదలకు ప్రవేశం లేకుండా గత టీడీపీ ప్రభుత్వం నిర్మించాలనుకున్న గేటెడ్ కమ్యూనిటీ అమరావతి అని అభివర్ణించారు సీఎం జగన్.

Advertisement
Update:2023-05-22 12:45 IST

సెంటు భూమి అంటూ అమరావతిలో పేదలకు ఇస్తున్న ఇళ్ల స్థలాలను వెటకారం చేస్తున్న ప్రతిపక్షాలకు కాస్త గట్టిగానే కౌంటర్ ఇచ్చారు సీఎం జగన్. బందర్ పోర్ట్ పనులకు శంకుస్థాపన చేసిన జగన్, అనంతరం జరిగిన బహిరంగ సభలో దుష్టచతుష్టయం అంటూ మరోసారి విరుచుకుపడ్డారు. దేవతల యజ్ఞాన్ని రాక్షసులు అడ్డుకుంటున్నట్టుగా సంక్షేమాన్ని అడ్డుకోవాలని దుష్టచతుష్టయం ప్రయత్నిస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ రాక్షసులకు మరింత గట్టిగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

ప్రజల సొమ్ముతో పేదలకు ప్రవేశం లేకుండా గత టీడీపీ ప్రభుత్వం నిర్మించాలనుకున్న గేటెడ్ కమ్యూనిటీ అమరావతి అని అభివర్ణించారు సీఎం జగన్. అమరావతిలో పేదలకు ప్రవేశం లేదా అని నిలదీశారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే టీడీపీకి ఎందుకంత కడుపు మంట అని ప్రశ్నించారు. అమరావతిలోకి పేదలు ఉదయాన్నే వచ్చి, అక్కడివారికి పనులు చేసి, సాయంత్రం ఇంటికెళ్లేలా చంద్రబాబు ప్లాన్ గీశారని.. కానీ తమ హయాంలో పేదలకు కూడా అమరావతిలో నివశించే అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. ఆర్-5 జోన్ లో ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని, త్వరలోనే వాటి పంపిణీ కార్యక్రమం మొదలవుతుందన్నారు. 50వేలమందికి ఇళ్ల పట్టాలివ్వబోతున్నామని, వారికి ఇళ్లు నిర్మించే బాధ్యత కూడా ప్రభుత్వానిదేనని చెప్పారు.


బందరు పోర్ట్ కి బాబే అడ్డంకి..

బందరు పోర్టు రాకుండా గతంలో చంద్రబాబే అడ్డుకున్నారని మండిపడ్డారు సీఎం జగన్. అమరావతిలో తాను కొన్న భూముల రేట్లు పెరుగుతాయని మచిలీపట్నానికి చంద్రబాబు తీవ్ర ద్రోహం చేశారన్నారు. బందరు పోర్టు నిర్మాణానికి గ్రహణాలు తొలగిపోయాయని చెప్పారు. అన్ని సమస్యలు అధిగమించి పోర్టు నిర్మాణం మొదలైందన్నారు. పోర్టు ఆధారిత పరిశ్రమల వల్ల లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుందని వివరించారు. బందరుకి సముద్ర వర్తకంలో వందల ఏళ్ల చరిత్ర ఉందని చెప్పారు. మరో రెండేళ్లో బందరు రూపు రేఖలు మారిపోతాయన్నారు. 

Tags:    
Advertisement

Similar News