ఏపీలో 'ముందస్తు' తరుముకొస్తోందా?
Early Election in Andhra Pradesh: రాష్ట్రవ్యాప్తంగా రోడ్లను బాగుచేయించటం, పక్కాగా నవరత్నాలను అమలు చేయించటం, సామాజికవర్గాల వారీగా బహిరంగ సభల నిర్వహణ లాంటివి కూడా ముందస్తు ఎన్నికల వాతావరణాన్ని సూచిస్తోందని అనుకుంటున్నారు.
ఇంతకాలం తెలంగాణకు మాత్రమే పరిమితమైన ముందస్తు ఎన్నికల ప్రచారం ఇప్పుడు ఏపీ విషయంలో కూడా మొదలైంది. జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి చూసిన తర్వాత ఈ ప్రచారం బలపడుతుంది. వైసీపీ తరపున క్షేత్ర స్ధాయిలో పనిచేస్తున్న రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బృందం ఐప్యాక్ ఇచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగానే జగన్ ముందస్తు ఎన్నికల విషయాన్ని సీరియస్‌గా ఆలోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి.
ప్రభుత్వ పథకాల అమలులో జగన్ చూపిస్తున్న శ్రద్ధ, మంత్రులు, ఎమ్మెల్యేలకు తీసుకుంటున్న క్లాసులు, గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం అమలుపై చూపిస్తున్న ఇంట్రస్టు, నియోజకవర్గానికి ఒక పరిశీలకుడిని నియమించటం, ఇతర పార్టీల్లో గట్టి నేతలను వైసీపీలోకి చేర్చుకోవటానికి చేస్తున్న ప్రయత్నాలు, అధికార యంత్రాంగంలో మార్పులు, రెగ్యులర్‌గా జిల్లాల పర్యటన లాంటివి ముందస్తు ఎన్నికలకు సంకేతాలుగా అందరు భావిస్తున్నారు.
ప్రతిపక్షాల మధ్య పొత్తులు లేకుండా చేయాలంటే ముందస్తుకు వెళ్ళటమే మంచి నిర్ణయమని జగన్ అనుకుంటున్నారట. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకండా పొత్తులు పెట్టుకోవాలని చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ చేసిన ప్రయత్నాలను జగన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నారట. నరేంద్ర మోడీ విశాఖ పర్యటన తర్వాత పవన్ ఆలోచనల్లో మార్పు వచ్చినా.. అది స్ధిరంగా ఉంటుందని ఎవరు నమ్మటం లేదు. ఇప్పుడు రెండు పార్టీలు దూరంగా ఉంటున్నా ఎన్నికల సమయంలో కలిసే అవకాశముందని జగన్ అనుమానిస్తున్నారట.
సో పార్టీల మధ్య పొత్తులు కుదరకుండా దెబ్బకొట్టాలంటే ముందస్తుకు వెళ్ళటమే మంచిదన్నది జగన్ ఆలోచన. తన పాలన విషయంలో జనాభిప్రాయం ఏమిటో తెలుసుకునేందుకు జగన్ రెగ్యులర్‌గా సర్వేలు చేయించుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రోడ్లను బాగుచేయించటం, పక్కాగా నవరత్నాలను అమలు చేయించటం, సామాజికవర్గాల వారీగా బహిరంగ సభల నిర్వహణ లాంటివి కూడా ముందస్తు ఎన్నికల వాతావరణాన్ని సూచిస్తోందని అనుకుంటున్నారు. అన్నీ కలిసొస్తే వచ్చే ఏడాదిలోనే ఎన్నికలు జరిగే అవకాశముందట. మరి ఏమి జరుగుతుందో చూడాల్సిందే.