రాబోతోంది కురుక్షేత్ర యుద్ధం.. సిద్ధంగా ఉండండి
మీ బిడ్డ పరిపాలన వాయిస్ ఆఫ్ ది వాయిస్ లెస్ అని చెప్పారు సీఎం జగన్. పేదల కోసం, పేదలను అభివృద్ధి చేయడం కోసం తన పాలన సాగుతోందన్నారు.
- నిరుపేదల కోసం నిలబడిన మన ప్రభుత్వానికి, నిరుపేదల్ని వంచించిన గత ప్రభుత్వానికి మధ్య యుద్ధం.
- అన్ని ప్రాంతాలను సమానంగా చూసిన మనకి, ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టించిన వారికి మధ్య యుద్ధం.
- మేనిఫెస్టోని పవిత్రంగా చూసిన మనకు, 10శాతం వాగ్దానాలు కూడా నిలబెట్టుకోలేని వారికి మధ్య యుద్ధం.
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 80శాతం లబ్ధి చేకూర్చిన మనకు.. ఎస్సీ కులాల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న ఆధిపత్యధోరణికి, బీసీల తోకలు కత్తిరిస్తానన్న అహంకారానికి మధ్య యుద్ధం.
- పేద విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ సిలబస్ ప్రవేశ పెట్టిన మనకు, పేదలకు ఇంగ్లిష్ మీడియం ఎందుకు అని ప్రశ్నించిన వారికి మధ్య
- పేదల ప్రజలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన మనకు, అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు వద్దు అని కోర్టులకెక్కిన వారికి మధ్య..
- లంచం అనే మాటే లేకుండా 2.35 లక్షల కోట్ల రూపాయలు పంపిణీ చేసిన మన ప్రభుత్వానికి, ఫైబర్ గ్రిడ్ స్కామ్, స్కిల్ స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్, అసైన్డ్ భూముల స్కామ్, అమరావతి పేరుతో దగా, జన్మభూమి కమిటీల దుర్మార్గాలు, నీరు-చెట్టు పేరిట చేసిన దోపీడీ, రైతులకు చేసిన మోసాలు, అక్కచెల్లెమ్మలకు చేసిన వంచనల.. మధ్య కురుక్షేత్ర యుద్ధం జరగబోతోందన్నారు సీఎం జగన్. విజయవాడలో ఆటో డ్రైవర్లకు వైఎస్సార్ వాహన మిత్ర పథకాన్ని అమలు చేసిన అనంతరం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. తమ ప్రభుత్వంలో జరిగిన పథకాలను, వాటి ద్వారా ప్రజలకు చేకూరిన లబ్ధిని మరోసారి వివరించారు.
వాయిస్ ఆఫ్ ది వాయిస్ లెస్
మీ బిడ్డ పరిపాలన వాయిస్ ఆఫ్ ది వాయిస్ లెస్ అని చెప్పారు సీఎం జగన్. పేదల కోసం, పేదలను అభివృద్ధి చేయడం కోసం తన పాలన సాగుతోందన్నారు. తన హయాంలో అమలు చేసిన ప్రతి పథకాన్ని మరోసారి వివరించారు. ప్రతి వర్గానికి న్యాయం జరిగేలా పథకాలు అమలు చేశామన్నారు.
ఎవరో అడిగితే ఇచ్చినవి కావు..
ఎవరో ఉద్యమాలు చేస్తేనో, ఎవరో డిమాండ్ చేస్తేనో, ఎవరో అడిగితేనో పథకాలను తీసుకు రాలేదని, తన పాదయాత్రలో ప్రజల సమస్యలను కళ్లారా చూసి, ప్రజల్లో ఒకడిగా సమస్యలకు పరిష్కారం వెదుకుతూ వేసిన అడుగులివి అని గుర్తు చేశారు సీఎం జగన్. వాహన మిత్ర ద్వారా 2023–24 సంవత్సరానికి 2,75,931 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున రూ. 275.93 కోట్ల ఆర్థిక సాయం అందజేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటి వరకు 1300కోట్ల రూపాయలు వాహన మిత్ర ద్వారా లబ్ధిదారులకు చేరిందని చెప్పారు. ఆ సాయాన్ని వారు ఏ అవసరాల కోసమైనా వినియోగించుకోవచ్చని, అయితే లైసెన్స్ లు, ఇన్సూరెన్స్ లు వంటివి సకాలంలో రెన్యువల్ చేసుకోవాలని సలహా ఇచ్చారు. ఆటో డ్రైవర్ లాగా ఖాకీ చొక్కా ధరించి సభలో ప్రసంగించారు సీఎం జగన్.
♦