అబద్ధాల బుర్రకథలు.. కూటమి నేతలపై జగన్ సెటైర్లు
అబద్ధాల చంద్రబాబుకి ఇద్దరు వంత పాడుతున్నారని ఎద్దేవా చేశారు సీఎం జగన్. ఒకవైపు దత్తపుత్రుడు, మరోవైపు ఆయన వదినమ్మ.. ఈ ముగ్గురూ కలసి రోడ్లపై అబద్ధాల బుర్ర కథలు చెబుతున్నారని అన్నారు.
ఏపీలో జరుగుతున్న ఎన్నికల యుద్ధం కేవలం చంద్రబాబుకు, జగన్కు మధ్య జరుగుతున్నది కాదని.. ఇది బాబు మోసాలకు, ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధం అని చెప్పారు సీఎం జగన్. ఇంటింటికి పెన్షన్ అందించిన ప్రభుత్వానికి, వాటిని ఆపిన బాబు దుర్మార్గాలకు మధ్య జరుగుతున్న యుద్ధం అని వివరించారు. చంద్రబాబు మోసాలకు, జగన్ విశ్వసనీయతకు మధ్య జరుగుతున్న యుద్ధం ఇదని అన్నారు. గుంటూరు సమీపంలోని ఏటుకూరు వద్ద నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభలో సీఎం జగన్ మరోసారి ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు.
అబద్ధాల బాబుకి వంతపాట..
అబద్ధాల చంద్రబాబుకి ఇద్దరు వంత పాడుతున్నారని ఎద్దేవా చేశారు సీఎం జగన్. ఒకవైపు దత్తపుత్రుడు, మరోవైపు ఆయన వదినమ్మ.. ఈ ముగ్గురూ కలసి రోడ్లపై అబద్ధాల బుర్ర కథలు చెబుతున్నారని అన్నారు. 2014లో ఇదే కూటమి కల్లబొల్లి హామీలిచ్చి అధికారం చేపట్టిందని.. వాటిలో ఒక్కటి కూడా అమలు చేయలేదని, మళ్లీ ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని కూటమి కట్టారని, ఓట్లు వేయాలని అడుగుతున్నారని ప్రశ్నించారు. బాబు చెప్పే సూపర్ సిక్స్, సూపర్ సెవన్ కథల్ని ఎవరూ నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు జగన్.
చంద్రబాబుకి ఓటు వేశారంటే.. వైసీపీ హయాంలో జరిగిన మంచిని ప్రజలు తమకు తామే వద్దు అని చెప్పినట్టవుతుందని, ఆ విషయం గుర్తుంచుకోవాలన్నారు సీఎం జగన్. గత 58 నెలలుగా జరిగిన మంచి కొనసాగాలంటే వైసీపీకే ఓటు వేయాలన్నారు. మేనిఫెస్టోను బైబిల్, భగవద్గీత, ఖురాన్ లాగా భావించి 99 శాతం హామీలను అమలు చేసి మీ ముందుకు వచ్చి మరోసారి ఆశీస్సులు కోరుతున్నానని అన్నారు జగన్. పాలకుడికి మంచి మనసు ఉండి మంచి చేస్తే మన జీవితాలు బాగుపడతాయని, ఆ పాలకుడు మోసగాడు అయితే మన బతుకులు అంధకారం అవుతాయని తేల్చి చెప్పారు. వాలంటీర్లు మళ్లీ మన ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ బాగుండాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు లేని పాలన కొనసాగాలన్నా, పిల్లల చదువులు, బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయం, మన ఆస్పత్రులు బాగుండాలన్నా ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని పిలుపునిచ్చారు.