విద్యుత్ రంగం సర్వ నాశనం..! విడుదలైన శ్వేత పత్రం..

మొత్తంగా విద్యుత్‌ రంగంలో ప్రజలకు, ప్రభుత్వానికి దాదాపు రూ.1,29,503 కోట్ల నష్టం జరిగిందని ఈ శ్వేతపత్రం ద్వారా తెలిపారు. సాధ్యమైనంత త్వరగా విద్యుత్‌ రంగాన్ని గాడిలో పెడతామని అన్నారు చంద్రబాబు.

Advertisement
Update:2024-07-09 17:55 IST

శ్వేత పత్రాలతో గత ప్రభుత్వం తప్పు ఒప్పుల్ని బయటపెడుతున్న సీఎం చంద్రబాబు.. తాజాగా విద్యుత్ రంగంపై అసలు వాస్తవాలు ఇవీ అంటూ ప్రజల ముందుకొచ్చారు. ఐదేళ్లలో విద్యుత్ వ్యవస్థను జగన్ సర్వ నాశనం చేశారని విమర్శించారాయన. అన్ని శాఖల్లోనూ భయంకరమైన పరిస్థితులు ఉన్నాయని, వాటన్నిటికీ ప్రజలకు తెలియజెప్పేందుకే ఈ శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం ఎంత నష్టం చేకూర్చిందనే విషయాన్ని ప్రజల ముందు ఉంచుతున్నట్టు తెలిపారు చంద్రబాబు.

ఏపీ బేవరేజస్ కార్పొరేషన్ బాండ్లలో.. ఏపీ జెన్‌కో, ట్రాన్స్‌కోలు పెట్టుబడులు పెట్టాయంటే, గత ప్రభుత్వం ఎలాంటి దుష్ట ఆలోచనలు చేసిందో అర్థం అవుతోందన్నారు సీఎం చంద్రబాబు. గత ఐదేళ్లలో ప్రజలపై రూ.32,166 కోట్ల ఛార్జీల భారం మోపారని, విద్యుత్‌ రంగంలో రూ.49,596 కోట్లు అప్పులు చేశారని విమర్శించారు. ట్రూఅప్‌, ఇంధన సర్‌ఛార్జి, ఎలక్ట్రిసిటీ డ్యూటీ పేరుతో అన్ని రకాలుగా ప్రజల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేశారని, గృహ వినియోదారులపై 45శాతం ఛార్జీలు పెంచారన్నారు. ఛార్జీల పెంపుతో కోటీ 53 లక్షల మంది ప్రజలు ఇబ్బంది పడ్డారని వివరించారు చంద్రబాబు.


చార్జీల పేరుతో వినియోగదారుల్ని మోసం చేయడంతోపాటు, వేలకోట్ల రుణం తీసుకుని విద్యుత్ రంగంపై కూడా గత ప్రభుత్వం పెనుభారం వేసిందన్నారు చంద్రబాబు. ఐదేళ్లలో విద్యుత్‌ సంస్థల అప్పు 79శాతం మేర పెరిగిందన్నారు. మొత్తంగా విద్యుత్‌ రంగంలో ప్రజలకు, ప్రభుత్వానికి దాదాపు రూ.1,29,503 కోట్ల నష్టం జరిగిందని ఈ శ్వేతపత్రం ద్వారా తెలిపారు. సాధ్యమైనంత త్వరగా విద్యుత్‌ రంగాన్ని గాడిలో పెడతామని అన్నారు చంద్రబాబు. భవిష్యత్ అంతా విద్యుత్ రంగానిదేనన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు మరింత పెరుగుతాయని, ఈవీల డిమాండ్‌ మేరకు విద్యుత్‌ ఉత్పత్తి పెంచుకోవాలన్నారు. విద్యుత్‌రంగాన్ని గాడిలో పెట్టేందుకు కేంద్రం సాయం తీసుకుంటామని స్పష్టం చేశారు చంద్రబాబు. 

Tags:    
Advertisement

Similar News