రాజ్యసభలో క్లీన్‌స్వీప్.. వైసీపీ సూపర్ రికార్డు
ఈ మూడు స్థానాలతో రాజ్యసభలో వైసీపీ బలం 11కి చేరనుంది. అంతేకాదు ప్రతిపక్ష టీడీపీకి స్థానం లేకుండా రాజ్యసభలో రాష్ట్ర స్థానాలన్నీ వైసీపీనే దక్కించుకుని, రికార్డు సృష్టించనుంది.
రాజ్యసభలో వైసీపీ రికార్డు సృష్టించబోతోంది. ద్వైవార్షిక ఎన్నికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలను వైసీపీ ఏకగ్రీవంగా దక్కించుకోనుంది. ఆ పార్టీ అభ్యర్థులుగా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డి నామినేషన్లు వేశారు. నామినేషన్ల గడువు ముగియడంతో ఇక అధికారికంగా ప్రకటించడమే మిగిలుంది. ఈ మూడు స్థానాలతో రాజ్యసభలో వైసీపీ బలం 11కి చేరనుంది. అంతేకాదు ప్రతిపక్ష టీడీపీకి స్థానం లేకుండా రాజ్యసభలో రాష్ట్ర స్థానాలన్నీ వైసీపీనే దక్కించుకుని, రికార్డు సృష్టించనుంది.
బలాబలాలు అటు ఇటు
రాజ్యసభలో ఏపీ కోటా సభ్యుల సంఖ్య పదకొండు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీకి ఇద్దరు.. టీడీపీకి 9 మంది సభ్యులు ఉండేవారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఏకంగా 151 శాసనసభ స్థానాల్లో ఘనవిజయం సాధించింది. టీడీపీ 23 స్థానాలకే పరిమితమైంది. ఆ సంఖ్యాబలంతో అప్పటి నుంచి ప్రతి రాజ్యసభ ఎన్నికల్లోనూ వైసీపీ సభ్యులే గెలుస్తున్నారు.
ఇదే తొలిసారి
ఈ ఏడాది ఏప్రిల్ 2తో కనకమేడల రవీంద్రకుమార్ (టీడీపీ), వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి (వైసీపీ), సీఎం రమేష్ (బీజేపీ)ల పదవీకాలం ముగియనుంది. ఈలోగా ఆ మూడు స్థానాలకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. ఒక రాజ్యసభ స్థానం గెలుచుకోవాలంటే కావాల్సిన 44 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీకి ఉన్నవి 22 మాత్రమే. దీంతో ఆ పార్టీ పోటీకి దిగలేదు. ఫలితంగా వైసీపీ నుంచి నామినేషన్లు వేసిన ముగ్గురూ రాజ్యసభకు ఎన్నిక కాబోతున్నారు. దీంతో రాష్ట్ర కోటాలోని 11 స్థానాలు వైసీపీ పరం కానున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో కానీ, రాష్ట్ర విభజన తర్వాత కానీ ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ స్థానాలన్నీ ఒకే పార్టీకి దక్కడం జరగలేదు. ఇప్పుడు ఆ రికార్డును వైసీపీ కైవసం చేసుకుంది.