'సినిమా' రాజకీయం జగన్ కు లాభమా..? నష్టమా..?
హిట్ అనే మాటకు మొహం వాచిపోయిన రామ్ గోపాల్ వర్మ ఏపీ ముఖ్యమంత్రితో గంటల సేపు కూర్చుని చర్చించే స్థాయిలో ఉన్నారంటే ఆయన 'వ్యూహం' బలంగా ఉందనే చెప్పాలి.
ఏపీలో గత ఎన్నికల సీజన్లో ఎన్టీఆర్ జీవిత చరిత్ర పేరుతో కథానాయకుడు, మహానాయకుడు అంటూ రెండు సినిమాలు విడుదలయ్యాయి. ఈ సినిమాలు టీడీపీకి ఏమేరకు ఉపయోగపడ్డాయో ఫలితాలు చెప్పకనే చెప్పాయి. సరిగ్గా ఈసారి ఎలక్షన్ సీజన్ కి ముందుగా రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. దీనికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ ఆయనే అయినా, ఆయనకు సూచనలు సలహాలు ఇస్తోంది మాత్రం ఏపీ సీఎం జగన్ అని స్పష్టమవుతోంది.
వ్యూహం అనే పేరుతో సీఎం జగన్ కి అనుకూలంగా, ప్రతిపక్షాలను ఎండగడుతూ రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా తీస్తున్నారు. గతంలో కూడా వర్మ.. చంద్రబాబుని, పవన్ కల్యాణ్ ని టార్గెట్ చేస్తూ సినిమాలు, షార్ట్ ఫిల్మ్ లు చేసినా వాటికి పెద్దగా ప్రజాదరణ రాలేదు. ఈసారి ఏకంగా జగన్ ఆశీస్సులతో వస్తున్న వ్యూహాన్ని వైసీపీ శ్రేణులు పెద్ద హిట్ చేసే అవకాశాలు లేకపోలేదు. పైగా ఈ సినిమాకోసం ఏకంగా రెండుసార్లు సీఎం జగన్, రామ్ గోపాల్ వర్మకు అపాయింట్ మెంట్ ఇవ్వడమే ఇక్కడ సంచలనం. మంత్రులకు, ఎమ్మెల్యేలకు కూడా సీఎం జగన్ అపాయింట్ మెంట్ అంత ఈజీగా దొరకదు అనే టాక్ బయట ఉంది. ఈ క్రమంలో బూతు సినిమాల దర్శకుడిగా, కాంట్రవర్సీ దర్శకుడిగా పేరున్న వర్మకు జగన్ ఏకంగా గంటలసేపు అపాయింట్ మెంట్ ఇవ్వడం, వ్యూహం గురించి చర్చించడం, ఆయన తీసిన సన్నివేశాలను ఓపికగా చూడటం విశేషమేమరి.
లాభమా...? నష్టమా..?
వ్యూహంలో రామ్ గోపాల్ వర్మ.. చంద్రబాబు, ఆయన అనుచరులపై సెటైర్లు పేలుస్తారనే విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ పాత్ర ఇందులో ఉంటుందా లేదా అనేది వేచి చూడాలి. వర్మ సినిమాలకు విడుదలకు ముందు ఉన్నంత హైప్ ఆ తర్వాత ఉండదు అనే ప్రచారం ఉంది. మరి ప్రభుత్వ మద్దతుతో వస్తున్న వ్యూహం కూడా అలాగే బీ గ్రేడ్ సినిమాలాగా ఉంటుందా, లేక వ్యూహాత్మకంగా ఇందులో ప్రజాకర్షక సన్నివేశాలు ఉంటాయా అనేది తేలాల్సి ఉంది.
ఎన్నికలముందు విడుదలయ్యే సినిమాల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని 2019లో టీడీపీకి తెలిసొచ్చింది. ఇప్పుడు జగన్ ఆ సాహసం చేస్తున్నారు. వర్మ వ్యూహం జగన్ కి కలిసొస్తుందా, లేక లేనిపోని తలనొప్పులు తెచ్చిపెడుతుందా అనేది వేచి చూడాలి. ఏది ఏమయినా హిట్ అనే మాటకు మొహం వాచిపోయిన రామ్ గోపాల్ వర్మ ఏపీ ముఖ్యమంత్రితో గంటల సేపు కూర్చుని చర్చించే స్థాయిలో ఉన్నారంటే ఆయన వ్యూహం బలంగా ఉందనే చెప్పాలి.