మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అరెస్ట్..

ఆ పత్రాలు ఫోర్జరీవంటూ సీఐడీ పోలీసులు రంగప్రవేశం చేశారు. అయ్యన్నను అరెస్ట్ చేశారు. అయ్యన్న కొడుకు రాజేశ్‌ని కూడా తమవెంట తీసుకెళ్లారు.

Advertisement
Update:2022-11-03 07:31 IST

పంట కాల్వ ఆక్రమించి ప్రహరీ గోడ నిర్మించారన్న కేసులో సీఐడీ పోలీసులు మాజీ మంత్రి, టీడీపీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడుని అరెస్ట్ చేశారు. ఆయన తనయుడు చింతకాయల రాజేశ్‌ని కూడా అదుపులోకి తీసుకున్నారు. నర్సీపట్నంలో తెల్లవారు ఝామున సీఐడీ పోలీసులు అయ్యన్నపాత్రుడు ఇంటికి వెళ్లారు. ప్రహరీ గోడ కూల్చివేత కేసులో ఆయన ఆధారాలుగా సమర్పించిన డాక్యుమెంట్లు ఫోర్జరీవని, అందుకే అరెస్ట్ చేస్తున్నామని తెలిపారు. సీఐడీ పోలీసులు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఏలూరు కోర్టులో అయ్యన్నను హాజరు పరుస్తామని చెప్పి తమతో తీసుకువెళ్లారు.

ఈ వివాదం ఏంటి..?

నర్సీపట్నంలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు నివాసం ఉంటున్న ఇంటి ప్రహరీ గోడను పంటకాల్వ ఆక్రమించి కట్టారనేది ప్రధాన అభియోగం. గతంలో దాన్ని కూల్చేందుకు రెవెన్యూ అధికారులు వెళ్లారు. అప్పట్లో గ్రామస్తులు అడ్డుకోవడంతో పెద్ద గొడవ అయింది. ఆ తర్వాత పోలీసులు నోటీసులివ్వగా, అది తన స్థలమేనంటూ అయ్యన్న కొన్ని పత్రాలను సమర్పించారు. ఆ తర్వాత హైకోర్టులో కూడా అయ్యన్నపాత్రుడికి ఊరట లభించింది. దీంతో ఈ కేసు మరుగునపడిపోయింది. తాజాగా ఆ పత్రాలు ఫోర్జరీవంటూ సీఐడీ పోలీసులు రంగప్రవేశం చేశారు. అయ్యన్నను అరెస్ట్ చేశారు. అయ్యన్న కొడుకు రాజేశ్‌ని కూడా తమవెంట తీసుకెళ్లారు.

టార్గెట్ చేశారా..?

అయ్యన్న పాత్రుడు మరో కొడుకు చింతకాయల విజ‌య్‌ని ఇటీవలే సీఐడీ పోలీసులు విచారణకు పిలిపించారు. ఆయన ఇంటికి వెళ్లి సోదాలు చేశారు. ఐటీడీపీ పేరుతో సోషల్ మీడియాలో వచ్చిన ట్వీట్లకు చింతకాయల విజయ్ కారణమంటూ ఆయన్ను విచారణకు పిలిపించారు. అయితే ఆ విభాగంతో తనకు సంబంధం లేదని విజయ్ హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టులో ఆయనకు ఊరట లభించింది. ఇది జరిగిన రోజుల వ్యవధిలోనే పాత కేసులో అయ్యన్నపాత్రుడు, ఆయన మరో కుమారుడు రాజేశ్‌ని సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లడం సంచలనంగా మారింది.

Tags:    
Advertisement

Similar News