చిరంజీవిది దృతరాష్ట్ర ప్రేమేనా? బుద్ధి చెప్పొచ్చుగా?

చిరంజీవి పద్దతైన మనిషే అయితే తమ్ముడిలోని లోపాలను ఎత్తిచూపించాలి. తప్పుదారిలో వెళుతున్న తమ్ముడిని సరైన మార్గంలోకి మళ్ళించాలి. నిజంగానే పవన్ గనుక చంద్రబాబు, జగన్ ఇద్దరినీ తప్పుపట్టి వ్యతిరేకించుంటే ఈ రోజు ఏపీలో రాజకీయం వేరేవిధంగా ఉండేది.

Advertisement
Update:2023-01-02 12:49 IST

'తన తమ్ముడు పవన్ కల్యాణ్‌పై కొందరు హద్దులు మీరి విమర్శలు చేస్తున్నారు' ఇది తాజాగా మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్య. తమ్ముడిని సమర్ధించుకుంటు చిరంజీవి ఇంకా చాలానే మాట్లాడారు. తమ్ముడిని విమర్శిస్తున్నందుకు, పవన్‌పై ఆరోపణలు చేస్తున్నందుకు అన్నగా చిరంజీవి బాధపడటంలో తప్పేమీలేదు. కానీ నిష్పక్షపాతంగా ఆలోచిస్తే చిరంజీవికి విషయం ఏమిటో అర్ధమవుతుంది. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అన్న నానుడిని మెగాస్టార్ మరచిపోయినట్లున్నారు.

సినిమాల్లో ఉన్నంత వరకు పవన్ గురించి రాజకీయ నేతలు ఎవరూ ఏమీ మాట్లాడలేదు. ఎప్పుడైతే రాజకీయాల్లోకి పవన్ వచ్చారో వెంటనే ఆరోపణలు, విమర్శలు మొదలయ్యాయి. అదికూడా ఎందుకు మొదలయ్యాయి ? ఇచ్చిన మాట తప్పినందుకే అని చిరంజీవి కన్వీనియంట్‌గా మరచిపోయారు. ప్రశ్నించేందుకే తాను పార్టీ పెట్టినట్లు పవన్ చెప్పుకున్నారు. అయితే పవన్ ప్రశ్నించింది ఎవరిని? ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా పవన్ టార్గెట్ చేస్తున్నది జగన్మోహన్ రెడ్డిని మాత్రమే అని చిరంజీవికి తెలీదా?

ఐదేళ్ళు చంద్రబాబునాయుడు అధికారంలో ఉంటే ఎన్నిసార్లు ప్రశ్నించారు. ఏ ప్రతిపక్షమైనా అధికార పార్టీని వదిలేసి మరో ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తుందా? ఇలాంటి విచిత్రమైన పరిస్ధితి ఏపీలో మాత్రమే కనబడింది. జగన్ అండ్ కో ఎప్పుడు చంద్రబాబును ఇబ్బంది పెడదామని ప్రయత్నించినా వెంటనే పవన్ మధ్యలో దూరి జగన్‌పైన విరుచుకుపడేవారు. చంద్రబాబును వదిలిపెట్టి పదేపదే జగన్‌నే టార్గెట్ చేసేవారు. ఇదంతా చూసిన తర్వాతే జగన్ అండ్ కో పవన్‌ను ప్యాకేజీ స్టార్ అని చంద్రబాబు దత్తపుత్రుడని అనటం మొదలుపెట్టారు. పవన్ మాత్రం ప్రత్యర్ధులను వెధవలని, గాడిదలని అడ్డగాడిదలని ఎన్నయినా అనచ్చు. కానీ ప్రత్యర్ధులు మాత్రం పవన్ ఏమన్నా అంటే చిరంజీవి తట్టుకోలేకపోతున్నారు.

చిరంజీవి పద్దతైన మనిషే అయితే తమ్ముడిలోని లోపాలను ఎత్తిచూపించాలి. తప్పుదారిలో వెళుతున్న తమ్ముడిని సరైన మార్గంలోకి మళ్ళించాలి. నిజంగానే పవన్ గనుక చంద్రబాబు, జగన్ ఇద్దరినీ తప్పుపట్టి వ్యతిరేకించుంటే ఈ రోజు ఏపీలో రాజకీయం వేరేవిధంగా ఉండేది. చంద్రబాబు, జగన్ ఇద్దరు ఒకటే అని అనుకున్న జనాలంతా పవన్ వెంటనడిచేవారేమో. అలాకాకుండా చంద్రబాబు ప్రయోజనాల కోసమే పవన్ పనిచేస్తున్నారని అనుకోబట్టే పోటీ చేసిన రెండుచోట్లా ఓడగొట్టారు. కాబట్టి తమ్ముడిని విమర్శిస్తున్నందుకు బాధపడకుండా అన్నగా బాధ్యత తీసుకుని మంచి దారిలోకి మళ్ళించాలి. లేకపోతే పవన్ మీద చిరంజీవికి ఉన్నది దృతరాష్ట్ర ప్రేమగా మారిపోవటం ఖాయం.

Tags:    
Advertisement

Similar News