రామోజీపై చీటింగ్ కేసు.. రేపు హైకోర్టులో క్వాష్ పిటిషన్ పై విచారణ
యూరి రెడ్డి ఫిర్యాదుతో ఏపీ సీఐడీ పోలీసులు కేసు నమోదు చేయగానే.. రామోజీ రావు వెంటనే హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ క్వాష్ పిటిషన్ రేపు హైకోర్టు ముందు విచారణకు రాబోతోంది.
మార్గదర్శి వ్యవహారంలో మరో కేసు నమోదైంది. అయితే ఇది సంస్థ కార్యకలాపాలకు సంబంధించింది కాదు, షేర్ హోల్డర్ల మధ్య ఉన్న గొడవ. మార్గదర్శి వ్యవస్థాపకులలో ఒకరైన గాదిరెడ్డి జగన్నాథ రెడ్డి కుమారుడు యూరిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఇందులో రామోజీరావు ఏ-1 కాగా, ఆయన కోడలు శైలజా కిరణ్ ఏ-2. సెక్షన్ 420, 467, 120-8, రెడ్ విత్ 34 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు. మార్గదర్శిలో తన షేర్లను శైలజ పేరు మీదకి మార్చారని, తనను తుపాకీతో బెదిరించి బలవంతంగా వాటా లాక్కున్నారని యూరిరెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు.
1962లో మార్గదర్శి చిట్ ఫండ్ పెట్టిన సమయంలో తన తండ్రి జగన్నాథరెడ్డి రూ.5 వేలు పెట్టుబడి పెట్టారని అంటున్నారు యూరి రెడ్డి. ఆ పెట్టుబడితో కొన్ని షేర్లు తన తండ్రికి వచ్చాయని, వాటి విషయంలో తమ వాటా గురించి అడగడానికి వెళ్లగా 2016లో రామోజీరావు తమను బెదిరించి వాటా రాయించుకున్నారని ఆరోపించారు. ఇటీవల తమ షేర్ హోల్డింగ్ పై స్పష్టత రావడంతో సీఐడీకి ఫిర్యాదు చేసినట్టు ఆయన పేర్కొన్నారు.
యూరి రెడ్డి ఫిర్యాదుతో ఏపీ సీఐడీ పోలీసులు కేసు నమోదు చేయగానే.. రామోజీ రావు వెంటనే హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ క్వాష్ పిటిషన్ రేపు హైకోర్టు ముందు విచారణకు రాబోతోంది. మార్గదర్శి చిట్ ఫండ్స్ నిర్వహణలో చందాదారులను మోసం చేసినందుకు ఇటీవల కేసులు ఎదుర్కొంటున్న రామోజీ.. ఇప్పుడు పార్టనర్స్ ని చీట్ చేసినందుకు కూడా కేసులు ఎదుర్కోవడం విశేషం.