నేటితో ముగియనున్న చంద్రబాబు రిమాండ్.. కోర్టు ఏ నిర్ణయం తీసుకోబోతోంది?

ఈ రోజు సాయంత్రంలోగా చంద్రబాబు రిమాండుపై ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.

Advertisement
Update:2023-10-05 08:22 IST

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కుంటున్న ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యూడీషియల్ రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు రిమాండ్ నేటితో ముగియనున్నది. ఇప్పటికే అరెస్టయిన తర్వాత రెండు సార్లు రిమాండ్‌ను ఏసీబీ కోర్టు పొడిగించింది. తాజాగా రిమాండ్ ముగియనుండటంతో కోర్టు ఏ నిర్ణయం తీసుకోనున్నదనే విషయంపై ఆసక్తి నెలకొన్నది.

చంద్రబాబు రిమాండ్‌ను మరోసారి పొడిగించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు తెలియజేస్తున్నారు. చంద్రబాబును వర్చువల్ విధానంలో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఏసీబీ కోర్టు జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నది. ఈ రోజు సాయంత్రంలోగా చంద్రబాబు రిమాండుపై ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. కాగా, రాజమండ్రి సెంట్రల్ జైల్ సూపరింటెండ్‌కు ఇంత వరకు ఈ విషయంలో సమాచారం అందలేదు. సీఐడీ పోలీసులు కోరిన వెంటనే తగిన ఏర్పాట్లు చేసి జడ్జి ముందు ప్రవేశపెడతామని సూపరింటెండెంట్ చెప్పారు.

మరోవైపు చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై జరిగిన విచారణ గురువారానికి వాయిదా వేశారు. చంద్రబాబును ఇప్పటికే రెండు రోజుల సీఐడీ కస్టడీకి ఇచ్చారని.. మరోసారి ఇవ్వొద్దని ఆయన తరపు లాయర్లు వాదించారు. చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలని లాయర్లు బలంగా కోరారు. కాగా, ఈ రోజు రిమాండ్‌కు సంబంధించిన నిర్ఖయం కూడా తీసుకోవల్సి ఉన్నది. దీంతో ఏసీబీ కోర్టు బెయిల్, కస్టడీ విచారణను గురువారానికి వాయిదా వేసింది.

సెప్టెంబర్ 9న నంద్యాలలో అరెస్టు అయిన తర్వాత ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. అప్పటి నుంచి చంద్రబాబుకు ఊరట కలగడానికి లాయర్లు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. మొదటి నుంచి బెయిల్ కోసం కంటే రిమాండ్ రిపోర్టును క్వాష్ చేయడంపైనే దృష్టి పెట్టారు. ఏపీ హైకోర్టు ఇప్పటికే ఈ క్వాష్ పిటిషన్ తిరస్కరించగా.. దాన్ని రివ్యూ చేయాలని సుప్రీంను ఆశ్రయించారు. చంద్రబాబు పిటిషన్ విచారణను ఈ నెల 12కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. దీంతో ఇప్పుడు బెయిల్‌పై దృష్టి పెట్టారు.

Tags:    
Advertisement

Similar News