అధికారికంగా చేతులెత్తేసిన చంద్రబాబు

వైఎస్సాఆర్‌ సీపీ టికెట్లు దక్కని సిట్టింగ్‌ ఎమ్యెల్యేలను తన వైపు తిప్పుకుని రాజ్యసభ ఎన్నికల బరిలోకి అభ్యర్థిని దింపాలని ఆయన ఆలోచన చేసినట్లు చెప్పుతూ వచ్చారు.

Advertisement
Update:2024-02-15 07:59 IST

రాజ్యసభ ఎన్నికల విషయంలో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేతులెత్తేశారు. ఇది ఊహిస్తున్న పరిణామమే గానీ తాజాగా అధికారికంగా విషయం వెలుగులోకి వచ్చింది. రాజ్యసభ ఎన్నికల విషయంలో ఆయన స్పష్టత ఇచ్చారు. ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన లేదని ఆయన పార్టీ నాయకులకు చెప్పారు. రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థిని పోటీకి దించాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు కొద్ది కాలంగా ఊహాగానాలు చెలరేగుతూ వచ్చాయి. చంద్రబాబు తాజా ప్రకటనతో వాటికి తెరపడినట్లే.

వైఎస్సాఆర్‌ సీపీ టికెట్లు దక్కని సిట్టింగ్‌ ఎమ్యెల్యేలను తన వైపు తిప్పుకుని రాజ్యసభ ఎన్నికల బరిలోకి అభ్యర్థిని దింపాలని ఆయన ఆలోచన చేసినట్లు చెప్పుతూ వచ్చారు. నిజానికి, రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించడానికి ఒక్కో అభ్యర్థికి 44 మంది ఎమ్యెల్యేల మద్దతు అవసరం. టీడీపికి 22 మంది ఎమ్యెల్యేలు మాత్రమే ఉన్నారు. వారిలోనూ నలుగురు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. అంటే, టీడీపికి మిగిలేది 18 మంది ఎమ్యెల్యేలే. నలుగురు వైసీపీ తిరుగుబాటు ఎమ్యెల్యేలు టీడీపీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. దానివల్ల టీడీపీకి అదే 22 మంది ఎమ్యెల్యేల మద్దతు ఉంటుంది.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వరుసగా అభ్యర్థుల జాబితాలను ప్రకటిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ టికెట్లు దక్కని సిట్టింగ్‌ ఎమ్యెల్యేల మద్దతు పొందడానికి చంద్రబాబు వ్యూహరచన చేసినా అది పారేది కాదు. కొద్దిమంది మాత్రమే అందుకు సిద్ధపడవచ్చు. మొత్తం మరో 22 మంది ఎమ్యెల్యేల మద్దతు కూడగట్టడం సులభమైన పనికాదు. ఒకవేళ ఆ ప్రయత్నాలు చేసినా ఆ వ్యూహం బెడిసికొడితే మొదటికే మోసం రావచ్చు. దాని ప్రభావం వచ్చే శాసనసభ ఎన్నికలపై కూడా పడవచ్చు.

జనసేన, బీజేపీలతో పొత్తులు, సీట్ల సర్దుబాటు వంటి విషయాలు ఎటూ తేలడం లేదు. బీజేపీ తన నిర్ణయాన్ని చెప్పడం లేదు. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలపై దృష్టిపెడితే శాసనసభ, లోక్‌సభ ఎన్నికలకు సిద్ధం కావడం కూడా కష్టం కావచ్చు. అందుకే రాజ్యసభ ఎన్నికల విషయంలో చంద్రబాబు చేతులెత్తేసినట్లు సమాచారం.

Tags:    
Advertisement

Similar News