ఈ నెల 19న పొత్తుపై క్లారిటీ ఇవ్వ‌నున్న చంద్ర‌బాబు

జనసేన విషయంలో టీడీపీ తీసుకోవాల్సిన స్టాండ్ గురించి చంద్రబాబు దిశానిర్దేశం చేస్తారని తమ్ముళ్ళు అనుకుంటున్నారు.

Advertisement
Update:2022-11-18 13:02 IST

తమ్ముళ్ళలో ఉత్కంఠ పెరిగిపోతోంది. దానికి కారణం ఏమిటంటే ఈ నెల 19వ తేదీన తమ్ముళ్ళందరితో చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా సమావేశం అవబోతున్నారు. ప్రత్యేక సమావేశం ఎందుకనే విషయమై కేంద్ర కార్యాలయం స్పష్టంగా చెప్పలేదు. ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, ప్రజాప్రతినిధులతో పాటు సీనియర్ నేతలందరూ తప్పక హాజరకావాల‌ని మాత్రమే సమాచారం ఇచ్చారు. తాజా పరిణామాలను గమనిస్తున్న తర్వాత పొత్తులపైన చంద్రబాబు కీలకమైన నిర్ణయాన్ని ప్రకటిస్తారని అందరు అనుకుంటున్నారు.

వచ్చే ఎన్నికల్లో జనసేనతో పొత్తుంటుందని చాలా మంది తమ్ముళ్ళు అనుకున్నారు. అయితే హఠాత్తుగా సీన్ మారిపోయింది. నాలుగు రోజులుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్కడ మాట్లాడినా జనసేనను గెలిపించాలని మాత్రమే చెబుతున్నారు. జనసేనకు అధికారం అప్పగించాలని మాత్రమే రిక్వెస్టు చేస్తున్నారు. పవన్ మాటలు విన్నతర్వాత బీజేపీతో మిత్రపక్షంగా కంటిన్యూ అయినా అవ్వకపోయినా టీడీపీకి మాత్రం దూరం జరిగారనే విషయం అర్ధమవుతోంది.

దాంతో జనసేన విషయంలో టీడీపీ తీసుకోవాల్సిన స్టాండ్ గురించి చంద్రబాబు దిశానిర్దేశం చేస్తారని అనుకుంటున్నారు. అలాగే ఇంతకాలం బీజేపీ నేతలు తనను ఎంతగా విమర్శిస్తున్నా చంద్రబాబు రియాక్ట్‌ కావటంలేదు. అలాగే తమ్ముళ్ళు కూడా నోరెత్తటం లేదు. బహుశా బీజేపీ విషయంలో కూడా చంద్రబాబు తమకు ఏదో చెబుతారనే తమ్ముళ్ళు అనుకుంటున్నారు. పొత్తులుంటాయనే అంచనాతో చంద్రబాబు కొన్నినియోజకవర్గాల్లో ఇన్‌చార్జిల‌ను నియమించ లేదు. అలాంటి నియోజకవర్గాలకు వెంటనే ఇన్‌చార్జిల‌ను ప్రకటించే అవకాశం ఉందని అనుకుంటున్నారు.

మొత్తం మీద తమ్ముళ్ళల్లో జరుగుతున్న చర్చ ఏమిటంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఒంటరి పోరాటానికి సిద్ధమైందనే అనిపిస్తోంది. ఇదే విషయాన్ని 19వ తేదీ ప్రత్యేక సమావేశంలో చంద్రబాబు ప్రకటించబోతున్నారనే అనుకుంటున్నారు. పార్టీ పరిస్ధితిపై చంద్రబాబు చేయించుకుంటున్న సర్వేల్లోను, బాదుడే బాదుడు కార్యక్రమాల్లో కనిపిస్తున్న జన స్పందన తదితరాల కారణంగా సైకిల్ జోరు పెరిగిందని చంద్రబాబు అనుకుంటున్నారని తమ్ముళ్ళు చెబుతున్నారు. కాబట్టి ఒంటరి పోరుకే పార్టీ సిద్ధమయ్యే అవకాశాలున్నాయనేది తమ్ముళ్ళ అంచనా. చాలా మంది తమ్ముళ్ళు ఇదే కోరుకుంటున్నారు కాబట్టి మెజారిటి తమ్ముళ్ళల్లో ప్రత్యేక సమావేశంపై ఉత్కంఠ పెరిగిపోతోంది.

Tags:    
Advertisement

Similar News