పవన్ కు చంద్రబాబు తేల్చిచెప్పేశారా..?
సీట్లపై పవన్ ఎంత ఒత్తిడి పెడుతున్నా.. చంద్రబాబు ఏ సంగతి తేల్చటంలేదని జనసేన వర్గాలు చెబుతున్నాయి. దాంతో చంద్రబాబు వైఖరిపై అలిగిన పవన్ 20వ తేదీన లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు బహిరంగ సభకు హాజరుకావటంలేదని చెప్పేశారట.
దాదాపు తొమ్మిదిన్నరేళ్ల తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంటికి చంద్రబాబు నాయుడు వెళ్ళారు. 2014 ఎన్నికల సందర్భంగా పవన్ ఇంటికి వెళ్ళిన చంద్రబాబు మళ్ళీ ఇప్పుడే వెళ్ళటం. వీళ్ళిద్దరి భేటీపైన రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ భేటీపైన రెండురకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఇందులో ఒకటి పవన్‌కు అనుకూలంగా ఉంటే.. రెండోది చంద్రబాబు కోణం నుంచి జరుగుతోంది.
ఇంతకీ విషయం ఏమిటంటే.. చంద్రబాబు వైఖరిపైన పవన్ అలిగినట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ, జనసేన పొత్తులో బీజేపీ చేరదని, కాబట్టి వెంటనే రెండు పార్టీల మధ్య సీట్ల పంపకాలను ఫైనల్ చేయాలని పవన్ అడిగారట. జనసేన పోటీచేయబోయే సీట్ల సంఖ్య, నియోజకవర్గాలపై క్లారిటీ ఇవ్వాలని పవన్ ఎన్నిసార్లు అడిగినా చంద్రబాబు మాత్రం దాటవేస్తున్నారట. కారణం ఏమిటంటే.. బీజేపీ లేకుండా ఎన్నికలకు వెళితే చాలా ఇబ్బందులు ఎదురవుతాయని చంద్రబాబు చెబుతున్నారట. జగన్మోహన్ రెడ్డిని కంట్రోల్ చేయాలంటే బీజేపీ కూడా పొత్తులో ఉండాల్సిందే అని చెప్పారట.
అందుకనే సీట్లపై పవన్ ఎంత ఒత్తిడి పెడుతున్నా.. చంద్రబాబు ఏ సంగతి తేల్చటంలేదని జనసేన వర్గాలు చెబుతున్నాయి. దాంతో చంద్రబాబు వైఖరిపై అలిగిన పవన్ 20వ తేదీన లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు బహిరంగ సభకు హాజరుకావటంలేదని చెప్పేశారట. మొదటికే మోసం వచ్చేట్లుందని గ్రహించిన చంద్రబాబు అర్జంటుగా పవన్ ఇంటికి వెళ్ళారట. సంక్రాంతి పండుగకు సీట్ల సంఖ్య, నియోజకవర్గాలు, మేనిఫెస్టో అన్నింటినీ ఫైనల్ చేసుకుందామని చెప్పినట్లు సమాచారం.
ఇక టీడీపీ వర్గాల ప్రకారం.. బీజేపీ కోసం వెయిట్ చేస్తే ఉపయోగముండదని పవన్‌కు చంద్రబాబు చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీ వదిలేసి రెండుపార్టీలు ఎన్నికలకు వెళదామని చంద్రబాబు చేసిన ప్రతిపాదనకు పవన్ బ్రేకులు వేస్తున్నారట. బీజేపీతో పెట్టుకుంటే తీవ్రంగా నష్టపోతామన్న విషయాన్ని చంద్రబాబు చెప్పినా పవన్ వినటంలేదట. సర్వేల్లో బయటపడుతున్న వివరాలను పవన్ కు వివరించారట. బీజేపీ లేకుండా ఎన్నికలకు వెళితే కష్టాలు తప్పవని చంద్రబాబుకు పవన్ చెప్పారని ప్రచారం జరుగుతోంది. బీజేపీని వదిలించుకుని వస్తే సీట్ల పంపకాలను ఫైనల్ చేసుకుందామని చంద్రబాబు తెగేసిచెప్పినట్లుగా టీడీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి.
బీజేపీని వదిలించుకుని రావాలని పవన్‌కు చంద్రబాబు తెగేసిచెప్పినట్లుగా జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. ఎందుకంటే.. చాలాకాలంగా బీజేపీతో పవన్ అంటీముట్టనట్లుగానే ఉన్నారు. బీజేపీని పవన్ అసలు పట్టించుకోవటమే లేదు. ఎన్డీయేలో భాగస్వామిగా ఉంటూనే చంద్రబాబుతో పొత్తు ప్రకటించినప్పుడే పవన్ బీజేపీని పట్టించుకోవటంలేదన్న విషయం స్పష్టమైంది. కాబట్టి టీడీపీ ప్రచారం అంత నమ్మేట్లుగా లేదు.