అదే వారికి ఆఖరి రోజు.. కుప్పంలో సీఎం చంద్రబాబు వార్నింగ్

రౌడీయిజం, అక్రమ వ్యాపారాలు.. కుప్పంలో చేయడానికి వీల్లేదన్నారు చంద్రబాబు. చేసినా, చేయాలని చూసినా అదే వారికి ఆఖరి రోజవుతుందని హెచ్చరించారు.

Advertisement
Update:2024-06-25 17:11 IST

ముఖ్యమంత్రిగా నాలుగోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంకు తొలిసారి వెళ్లారు. ఈ పర్యటనలో ఆయన స్థానిక నేతలతో సమావేశమయ్యారు. అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. బహిరంగ సభలో పాల్గొన్నారు. సీఎం హోదాలో ఆయన సభకు వెళ్లినా.. తన మాటలతో ఎన్నికల మూడ్ ని మరోసారి తీసుకొచ్చారు. రౌడీయిజం చేయాలని చూస్తే జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు.


కుప్పం ప్రశాంతతకు మారుపేరు అని చెప్పారు చంద్రబాబు. అలాంటి తన నియోజకవర్గంలో రౌడీయిజం చేసినా, చేయాలని చూసినా.. అదే వారికి ఆఖరి రోజు అవుతుందని హెచ్చరించారు. మళ్లీ జన్మంటూ ఉంటే కుప్పంలోనే పుడతానని చెప్పారు. ప్రజా క్షేత్రంలోకి వెళ్లే ముందు కుప్పం ప్రజల ఆశీస్సులు తీసుకోడానికి తాను ఇక్కడకు వచ్చానన్నారు. ఇక్కడి ప్రజల ఆశీస్సుల వల్లే తాను మళ్లీ ముఖ్యమంత్రి కాగలిగాను అని చెప్పుకొచ్చారు చంద్రబాబు.


అంతకు ముందు చంద్రబాబు హంద్రీనీవా కుప్పం బ్రాంచ్ కెనాల్ కాలువను పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బహిరంగ సభలో మాత్రం ఆవేశపూరితంగా ప్రసంగించారు. ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు ఇంత ఆవేశంగా మాట్లాడటం ఇదే మొదటిసారి. మరి ఈ ఆవేశాన్ని మాటలకే పరిమితం చేస్తారా, లేక చేతల్లో కూడా చూపిస్తారా అనేది తేలాల్సి ఉంది. ఇప్పటికే రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ వైసీపీ ఆరోపణలు చేస్తోంది, ఇప్పుడు చంద్రబాబు వార్నింగ్ పై కూడా వైసీపీ నుంచి కౌంటర్లు పడే అవకాశాలున్నాయి. 

Tags:    
Advertisement

Similar News