చంద్రబాబు మార్కు.. వీడియో కాన్ఫరెన్స్ లు మొదలు
పనికంటే ప్రచారం ఎక్కువ అనే ఆరోపణలు ఉన్నా కూడా చంద్రబాబు ఎందుకో ఈ సంప్రదాయాన్నే కొనసాగించేవారు. సభలకంటే ఆయన సమీక్షలకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది.
ఏపీలో ప్రభుత్వ మారింది. ఆ మార్పు ఇప్పుడు స్పష్టంగా కనపడుతోంది. గత ప్రభుత్వంలో విపత్తుల సమయంలో అధికారుల్ని హడావిడి పెట్టేవారు జగన్. ఇప్పుడు అధికారులతోపాటు తాను కూడా హడవిడిపడిపోతూ కనపడుతున్నారు చంద్రబాబు. పాలనలో ఒక్కొకరిదీ ఒక్కో మార్కు. ఇప్పుడు చంద్రబాబు మార్కు హడావిడి మొదలైంది. తాజాగా ఏపీలో భారీ వర్షాలు, వరదలపై సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 8 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో ఆయన మాట్లాడారు.
వార్ రూమ్ లు..
గతంలో చంద్రబాబు హయాంలో ఎక్కడ ఏ విపత్తు వచ్చినా వార్ రూమ్ ల సంప్రదాయం ఉండేది. అధికారులంతా ఆ వార్ రూమ్ లలో నిరంతరం అందుబాటులో ఉండేవారు. కాల్ సెంటర్లు, డేటా సేకరణ, నివేదికల తయారీ.. అన్నీ అందులోనే. పనికంటే ప్రచారం ఎక్కువ అనే ఆరోపణలు ఉన్నా కూడా చంద్రబాబు ఎందుకో ఈ సంప్రదాయాన్నే కొనసాగించేవారు. సభలకంటే ఆయన సమీక్షలకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది.
తాజాగా అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు ఇరిగేషన్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విపత్తులు వచ్చినప్పుడే సమర్థత బయటపడుతుందని చెప్పారు. అధికారులు పూర్తి అప్రమత్తంగా, డైనమిక్‌గా పని చేయాలని చెప్పారు. వర్షాలతో ఇబ్బంది పడుతున్న జిల్లాల్లో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. చెరువులు, వాగుల్లో ప్రవాహాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారాయన. మొత్తమ్మీద అధికారుల్ని పరుగులు పెట్టిస్తూ తనదైన మార్కు పాలన ప్రారంభించారు సీఎం చంద్రబాబు.