'నేతన్న నేస్తం' ప్రస్తావన లేకుండానే చంద్రబాబు ట్వీట్

సూపర్ సిక్స్ హామీల గురించి అడిగితేనే ఖజానా ఖాళీ అనే మాట వినపడుతోంది. ఇక నేతన్న నేస్తం, లా నేస్తం, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం వంటి వాటి గురించి అడగాల్సిన పనే లేదు.

Advertisement
Update:2024-08-07 12:09 IST

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు రాజకీయ నేతలు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా చేనేత కార్మికులకు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఈరోజు చీరాల నియోజకవర్గంలో చేనేతలను నేరుగా కలిసి వారి కష్టసుఖాలు తెలుసుకోబోతున్నారు. ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు కనీసం 'నేతన్న నేస్తం' పథకం గురించి ప్రస్తావించకపోవడం విశేషం. గత ప్రభుత్వ హయాంలో చేనేత కార్మికుల కోసం నేతన్న నేస్తం అమలైంది. ఏడాదికి రూ.24వేల రూపాయలు ప్రభుత్వం నుంచి నేతన్నలకు ఆర్థిక సాయం అందేది. కూటమి ప్రభుత్వం దాన్ని కొనసాగిస్తుందా, లేదా అనేది అనుమానంగా మారింది.


సీఎం ట్వీట్ ఏంటంటే..?

"అద్భుతమైన నేత కళను ప్రపంచానికి అందించిన చేనేత కార్మికులు మన దేశ ప్రతిష్టను పెంచారు. అలాంటి చేనేత కార్మికులను ప్రోత్సహించడం అందరి బాధ్యత. ప్రభుత్వపరంగా చేనేత రంగానికి అండగా నిలిచి నేతన్నలకు భరోసా ఇస్తాం. సమగ్ర చేనేత విధానం తీసుకువచ్చి, సబ్సిడీలు పునరుద్ధరించి చేనేత కుటుంబాలను, చేనేత రంగాన్ని నిలబెడతాం. వెలకట్టలేని నైపుణ్యం, సృజనాత్మకతకు నెలవైన చేనేతకు పునర్వైభవం తీసుకువస్తాం." అని ట్వీట్ వేశారు చంద్రబాబు. సబ్సిడీలు, సమగ్ర చేనేత విధానం అనేవి వినడానికి బాగుంటాయి కానీ, చేతల్లో కనిపించవు, కనిపించినా వాటి ప్రతిఫలాలు నేరుగా కార్మికులకు అందవు. నేరుగా కార్మికులకు న్యాయం చేయాలంటే నేతన్న నేస్తం లాంటి ఆర్థిక సాయం అందించే పథకాలే బెస్ట్. కానీ కూటమి ప్రభుత్వం ఆ పథకం గురించి ప్రస్తావించేందుకు కూడా ఇష్టపడటం లేదు.

సూపర్ సిక్స్ హామీల గురించి అడిగితేనే ఖజానా ఖాళీ అనే మాట వినపడుతోంది. ఇక నేతన్న నేస్తం, లా నేస్తం, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం వంటి వాటికి నిధుల సమీకరణ మరింత కష్టం అని వేరే చెప్పక్కర్లేదు. అయితే జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కనీసం నేతన్న నేస్తం పథకాన్ని కొనసాగిస్తున్నామనే భరోసా కూడా ఇవ్వలేకపోవడం ఇక్కడ విశేషం. 

Tags:    
Advertisement

Similar News