జగన్ చేతకాని తనమే చంద్రబాబు ధైర్యమా?

పార్టీ ఆఫీసులో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు కొనసాగింపే ఇప్పుడు ప్రాజెక్టుల సందర్శన. సాగునీటి ప్రాజెక్టులను సందర్శించాలని చంద్రబాబు అనుకోవటమే ఆశ్చర్యంగా ఉంది.

Advertisement
Update:2023-08-01 11:28 IST

చంద్రబాబునాయుడు ఈ రోజు నుండి రాయలసీమ టూర్ పెట్టుకున్నారు. ఎందుకంటే సాగునీటి ప్రాజెక్టులను పరిశీలించటానికి. ఎందుకు పరిశీలించాలంటే ప్రాజెక్టులను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తోంది జనాలందరికీ వివరించటానికట. తమ హయాంలో సాగునీటి ప్రాజెక్టులకు ఎంత ప్రాధాన్యత ఇచ్చాము, ఇపుడు జగన్ హయాంలో ఎందుకు నిర్లక్ష్యానికి గురవుతున్నాయనే విషయమై ప్రత్యక్షంగా పరిశీలించేందుకు డైరెక్టుగా ప్రాజెక్టుల దగ్గరకే వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. మూడు రోజులు వరుసగా పార్టీ ఆపీసులో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ప్రభుత్వం తీరుపై మండిపోయారు.

పార్టీ ఆఫీసులో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు కొనసాగింపే ఇప్పుడు ప్రాజెక్టుల సందర్శన. సాగునీటి ప్రాజెక్టులను సందర్శించాలని చంద్రబాబు అనుకోవటమే ఆశ్చర్యంగా ఉంది. జగన్ ప్రభుత్వం చేతకాని తనమే చంద్రబాబుకు ధైర్యమిచ్చిందని చెప్పాలి. ఎందుకంటే సాగునీటి ప్రాజెక్టులను అసలు నిర్లక్ష్యం చేసిందే చంద్రబాబు. 1995-2003 వరకు సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా ఎండగట్టి పాలన మొత్తంలో ఐటి జపం చేశారు. తర్వాత 2014లో అధికారంలోకి వచ్చినా 2016 నుండి అమరావతి జపం చేశారు.

2017లో కానీ పోలవరం ప్రాజెక్టును పట్టించుకోలేదు. అప్పటి నుండి హడావుడి చేశారు కానీ పనులు అంతగా జరగలేదు. తన హయాంలో పనులు జెట్ స్పీడులో జరిగిపోతోందన్న కలరింగ్ మాత్రం ఇచ్చారు. చంద్రబాబు పూర్తి చేసింది ఒక్క పట్టిసీమ ఎత్తిపోతల పథకం మాత్రమే. పేరుకు రాయలసీమ నేతే కానీ ఏనాడూ రాయలసీమను ఏ రకంగా కూడా పట్టించుకోలేదు. అధికారంలో నుండి దిగిపోయిన ఇంతకాలానికి సాగునీటి ప్రాజెక్టులు గుర్తుకొచ్చాయి.

రాయలసీమ ప్రాజెక్టుల పనితీరు చంద్రబాబు హయాంలో ఎలా జరిగింది? తమ హయాంలో ఎలా జరుగుతోంది అనే వివరాలు చెప్పేంత సీన్ జగన్ ప్రభుత్వానికి లేదు. ప్రాజెక్టులవారీగా వివరాలు చెప్పాలన్న ఆలోచన కూడా మంత్రి అంబటి రాంబాబు లేదా సలహాదారులకు రావటంలేదు. అందుకనే ప్రభుత్వంపై చంద్రబాబు బురదచల్లటమే కాకుండా ఏకంగా ప్రాజెక్టుల సందర్శనకు బయలుదేరుతున్నారు.

ముందుగా నంద్యాల జిల్లా నందికొట్కూరులోని మల్యాల ఎత్తిపోతల పథకాన్ని మంగళవారం సాయంత్రం సందర్శిస్తారు. తర్వాత బుధవారం అలగనూరు రిజర్వాయర్ను పరిశీలిస్తారు. తర్వాత నందికొట్కూరులో జరగబోయే బహిరంగసభలో మాట్లాడుతారు. తర్వాత ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని పరిశీలిస్తారు. ఆ తర్వాత బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్‌ను పరిశీలిస్తారు. గురువారం రాత్రికి కడప జిల్లా జమ్మలమడుగు చేరుకుంటారు. శుక్రవారం ఉదయం జిల్లాలోని ప్రాజెక్టులను పరిశీలిస్తారు.

Tags:    
Advertisement

Similar News