`రా.. కదలిరా` సభలకు బాబు విరామం.. సీట్ల సర్దుబాటు ఫైనల్ చేయడానికే!
లెక్క తేల్చుకునేందుకు బాబు, పవన్ త్వరలోనే సమావేశం కానున్నారు. టీడీపీ, జనసేన పొత్తులో అత్యంత కీలకమైన ఈ ఘట్టం రెండు పార్టీల ఉమ్మడి ప్రయాణం ఎలా ఉంటుందనేది నిర్దేశించబోతోంది.
`రా.. కదలిరా` పేరిట నిర్వహిస్తున్న సభలకు టీడీపీ అధినేత చంద్రబాబు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు. వచ్చే నెల 4న తిరిగి సభలు ప్రారంభిస్తారు. మిత్రపక్షం జనసేనతో సీట్ల సర్దుబాటు కసరత్తు పూర్తి చేసేందుకు ఈ బ్రేక్ తీసుకున్నారు. ఏ పార్టీకి ఎన్ని సీట్లనేది లెక్క తేల్చుకునేందుకు బాబు, పవన్ త్వరలోనే సమావేశం కానున్నారు. టీడీపీ, జనసేన పొత్తులో అత్యంత కీలకమైన ఈ ఘట్టం రెండు పార్టీల ఉమ్మడి ప్రయాణం ఎలా ఉంటుందనేది నిర్దేశించబోతోంది.
నువ్వు రెండంటే.. నేను రెండు అంటా
జనసేనతో పొత్తు ఉంటుందని చెబుతూనే చంద్రబాబు ఏకపక్షంగా రెండు సీట్లు ప్రకటించేశారు. చంద్రబాబు బుద్ధి ఇలాగే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు ముందు నుంచి హెచ్చరిస్తున్నా.. పెద్దగా పట్టించుకోని పవన్, ఆ దెబ్బకు అలర్టయిపోయారు. టీడీపీ రెండు సీట్లు ప్రకటించింది కాబట్టి తానూ రెండు ప్రకటించక తప్పడం లేదని వ్యాఖ్యానించారు. రాజోలు, రాజానగరం రెండూ మేమే పోటీ చేస్తామని ప్రకటించేశారు. ఈ పరిస్థితి రెండు పార్టీల మధ్య క్షేత్రస్థాయిలో మాటల మంటలు రేపుతోంది.
అధినేతలు చెబితే వింటారా?
చంద్రబాబు, పవన్ కూర్చునిసీట్ల పంపకంపై లెక్క తేలుస్తారు. అయితే అధినేతలు చెప్పిన ఆ లెక్కల్ని, వారు సూచించిన స్థానాల్ని రెండు పార్టీల నాయకులు, శ్రేణులు ఎంతవరకు అంగీకరిస్తాయనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మిలియన్ డాలర్ల ప్రశ్న. ప్రతిచోటా తాము బలపడ్డామని టీడీపీ నేతలు అంటుంటే, ఆ బలం తామేనన్నది జనసేన వారి వాదన. ఇది అంతిమంగా ఏ స్థాయికి తీసుకెళుతుందనేదే పొత్తు సినిమాలో హైలైట్ సీన్ కాబోతుంది.