డయాఫ్రమ్ అంటే తెలుసా..? అంబటిపై చంద్రబాబు పంచ్ లు
పి4 అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చానని, దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తే రాష్ట్రంలో పేదరికమే ఉండదని ప్రజలకు హామీ ఇచ్చారు చంద్రబాబు.
ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుపై చంద్రబాబు పంచ్ లు విసిరారు. అంబటికి ఓనమాలు తెలియవని, ఇరిగేషన్లో డయాఫ్రమ్ అంటే ఏంటో తెలియదన్నారు. సీఎం మొహంలో నవ్వు చూడటానికి ఆయన రోజూ తనని, పవన్ ని తిడుతుంటారని చెప్పుకొచ్చారు. నోరుంటే సరిపోదని, ఆంబోతులా అరిస్తే లాభం లేదని మండిపడ్డారు. సత్తెనపల్లి సభలో చంద్రబాబు అంబటిపై చెణుకులు విసిరారు. పెదకూరపాడు అమరావతి రోడ్డు వేయలేని నువ్వు టీడీపీని విమర్శించే మగాడివా అని ప్రశ్నించారు. మీ మంత్రి గురించి ఎంత తక్కువ మాట్లాడితే తనకు అంత ఎక్కువ గౌరవం అని ముక్తాయించారు. కార్మికుడు చనిపోతే లంచం అడిగిన మంత్రి ఆయన అని, రెండున్నర లక్షలకోసం కక్కుర్తి పడిన మంత్రి అంటూ అంబటిపై సెటైర్లు వేశారు.
ఏమైంది నీ చెత్త దీవెన..?
జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన అంటూ విద్యార్థుల్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు చంద్రబాబు. పిల్లలు చదువుకోడానికి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారని, ఏమైంది నీ చెత్త దీవెన అంటూ నిలదీశారు. పీజీ చదువుకునే వాళ్ళకు ఫీజు రీఎంబర్స్ మెంట్ ఇవ్వటం లేదన్నారు. మెడికల్, ఇంజినీరింగ్ కాలేజీలను టీడీపీ నెలకొల్పితే, వైసీపీ వాటిని మూసేస్తోందన్నారు. సైకోకు చదువు రాదు కనుక మీ పిల్లలకు చదువు లేకుండా చేస్తున్నాడంటూ మండిపడ్డారు. అప్పు చేసి పప్పు కూడు తింటే ఏమొస్తుందని ప్రశ్నించారు చంద్రబాబు.
విజన్ 2029
2029కి దేశంలో ఏపీ నెంబర్ వన్ గా ఉండాలని ప్రణాళిక వేసుకున్నామని, కానీ జగన్ వచ్చి పాదయాత్రలో ముద్దులు పెట్టి, ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నారని, రాష్ట్ర వినాశనానికి కారణం అయ్యారని మండిపడ్డారు చంద్రబాబు. ఏపీలో గంజాయి కూడా వాణిజ్య సాగుగా మారిపోయిందన్నారు. 2 లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారని, ప్రజల పేరుమీద 10 లక్షల కోట్లు అప్పు చేశారని చెప్పారు.
గొడ్డలి పోటుతో బాబాయ్ ని లేపేసి, ఆ తప్పు తనపై వేశారని, ఆయన చెల్లెలు కూడా వివేకాపై అపనిందలు వేయడాన్ని ఖండించిందని, దీనిపై జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు చంద్రబాబు. ఏపీలో ఇప్పుడు అన్నా క్యాంటీన్ ఉందా, చంద్రన్న బీమా ఉందా, విదేశీ విద్య ఉందా, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్స్ ఉన్నాయా.. అని ప్రశ్నించారు. నవరత్నాల పేరుతో నవ మోసాలు చేస్తున్నారని విమర్శించారు. పది రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకుంటున్నారని అన్నారు. రిజిస్ట్రేషన్ చార్జీలు 9 శాతం పెంచారని, మద్యం రేట్లు పెంచి నాసిరకం జగన్ బ్లాండ్లు అమ్ముతున్నారని, ప్రతి ఏటా ఆస్తి పన్ను పెంచుతున్నారని, అక్రమ కేసులకు భయపడి ఎవరూ జగన్ ని ప్రశ్నించడంలేదని చెప్పారు చంద్రబాబు.
ఇల్లు నీది, దానిపై స్టిక్కర్ జగన్ ది. పొలం మీది, పాస్ పుస్తకంపై ఫోటో జగన్ ది. ఎవరి ఇంటిపై అయినా జగన్ స్టిక్కర్ వేస్తే దానిపై 6093 అనే నెంబర్ వేయాలని సూచించారు. పి4 అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చానని, దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తే రాష్ట్రంలో పేదరికమే ఉండదని ప్రజలకు హామీ ఇచ్చారు చంద్రబాబు.