చంద్రబాబు ఎమ్మెల్సీ వ్యూహాలు.. టీడీపీకి అంత సీన్ ఉందా..?

ప్రభుత్వ టీచర్లకు సకాలంలో జీతాలు ఇవ్వడంలేదని, వారికి వైన్ షాపుల వద్ద డ్యూటీలు వేశారని, పీఆర్సీ విషయంలో మోసం చేశారని, సీపీఎస్ రద్దు హామీ నెరవేర్చలేదని.. ఇలా అన్ని విధాల టీచర్లకు హితబోధ చేస్తున్నారు చంద్రబాబు.

Advertisement
Update:2023-03-11 20:06 IST

చంద్రబాబు నాయుడు

పట్టభద్రుల, ఉపాధ్యాయుల నియోజకవర్గాలకు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వామపక్షాలు బలపరచిన అభ్యర్థులు గెలవడం రివాజు. గతంలో కూడా ఇదే ఆనవాయితీ కొనసాగింది. అంతెందుకు ప్రతిపక్షంలో ఉండగా, వైసీపీ కూడా పీడీఎఫ్ అభ్యర్థులనే బలపరిచింది, టీడీపీకి షాకిచ్చింది.


ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చాక వివిధ సమీకరణాల నేపథ్యంలో పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులను బరిలో దింపింది.

వైసీపీ ధీమా ఏంటి..?

పట్టభద్రుల నియోజకవర్గాలకు సంబంధించి సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ల ఓట్లపై వైసీపీ గట్టి నమ్మకం పెట్టుకుంది. సచివాలయాల్లో ఉద్యోగులంతా పట్టభద్రులే, వారి ఓట్ల నమోదు విషయంలో ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంది, ఏకపక్షంగా ఆ ఓటు వైసీపీ అభ్యర్థులకే పడే అవకాశముంది. వాలంటీర్లలో కూడా చాలామంది ఉన్నత విద్యావంతులే కాబట్టి ఓటు ఉన్నవారు వైసీపీకే మద్దతిస్తారనడంలో ఆశ్చర్యంలేదు. వైసీపీ పోల్ మేనేజ్ మెంట్ కూడా బ్రహ్మాండంగా ఉందని సర్వేలు చెబుతున్నాయి.


ఇక ఉపాధ్యాయుల విషయానికొస్తే, ఈ దఫా ప్రైవేట్ టీచర్ల ఓట్ల నమోదులో ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించి విజయం సాధించింది. ప్రైవేట్ విద్యాసంస్థలకు చెందిన వారికే అభ్యర్థులుగా బీ ఫారంలు ఇచ్చి పోటీకి దింపింది. దీంతో ఇక్కడ ప్రభుత్వ, ప్రైవేట్ టీచర్ల ఓట్ల మధ్య చీలిక స్పష్టంగా ఉంది.


ప్రభుత్వ ఉపాధ్యాయులు, జీతాల విషయంలో, పీఆర్సీ విషయంలో ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉంటారేమో కానీ, ప్రైవేట్ టీచర్లు ఏకపక్షంగా వైసీపీ బలపరచిన అభ్యర్థులకే ఓట్లు వేస్తారనే అంచనాలున్నాయి. ఈ దశలో వైసీపీ గెలుపు నల్లేరుపై నడక అనుకుంటోంది.

ఎలా చూసుకున్నా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి పెద్దగా బలం లేదు. కానీ చంద్రబాబు మాత్రం పోరాడుతున్నారు. 2024 ఎన్నికలకు ఇదే నాంది, పునాది అంటూ.. పాత డైలాగులే వల్లె వేస్తున్నారు. వైసీపీ పతనం స్థానిక ఎన్నికలతో మొదలవుతుందని, అప్పుడెప్పుడో కొట్టిన డైలాగులు పూర్తిగా రివర్స్ అయ్యాయి. ఇప్పుడు మళ్లీ అవే మాటలు చెబుతున్నారు చంద్రబాబు. ప్రాధాన్యతా ఓట్ల విషయంలో కొత్త లాజిక్ తెరపైకి తెస్తున్నారు. మొదటి ప్రాధాన్యత ఓటు టీడీపీ అభ్యర్థులకి, రెండో ప్రాధాన్యత ఓటు పీడీఎఫ్ అభ్యర్థులకి ఇవ్వాలని కోరారు చంద్రబాబు.


ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు..

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అని చెబుతున్నారు చంద్రబాబు. వైసీపీకి ఎవరూ ఓటు వేయొద్దంటున్నారు. ప్రభుత్వ టీచర్లకు సకాలంలో జీతాలు ఇవ్వడంలేదని, వారికి వైన్ షాపుల వద్ద డ్యూటీలు వేశారని, పీఆర్సీ విషయంలో మోసం చేశారని, సీపీఎస్ రద్దు హామీ నెరవేర్చలేదని.. ఇలా అన్ని విధాల టీచర్లకు హితబోధ చేస్తున్నారు.


అదే సమయంలో పట్టభద్రుల నియోజకవర్గాల్లో నిలబడిన వైసీపీ అభ్యర్థులకు నేర చరిత్ర ఉందని, వారికి ఓటు వేయొద్దని కోరుతున్నారు. వైసీపీ గెలుపు ధీమాతో ఉంటే, చంద్రబాబు ప్రాధాన్య ఓట్ల విషయంలో లాజిక్ లు చెబుతూ గెలుపు మాదేనంటున్నారు. ఒకవేళ వైసీపీ గెలిచినా దొంగఓట్ల నమోదు అనే అపవాదు ఎలాగూ ఉంది.

Tags:    
Advertisement

Similar News