భేటీ ముగిసింది.. పూజ మిగిలుంది

ప్రస్తుత ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక సాయం చేయాలని అమిత్ షా ని కోరినట్టు చంద్రబాబు తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో పేర్కొన్నారు.

Advertisement
Update:2024-07-17 08:32 IST

కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ దొరకడంతో ఢిల్లీ బయలుదేరి వెళ్లిన సీఎం చంద్రబాబు పనిలో పనిగా ఈరోజు ఢిల్లీలో తన అధికారిక నివాసంలో పూజలు ముగించుకుని ఏపీకి తిరిగి వస్తారని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఢిల్లీకి వచ్చినప్పుడల్లా చంద్రబాబు 50-అశోకా రోడ్ లో బసచేసేవారు. ఇకపై ఆయన అడ్రస్ 1-జన్ పథ్ కి మారుతోంది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా తన అధికారిక నివాసంలో చంద్రబాబు పూజలు నిర్వహిస్తారని తెలుస్తోంది.

ముగిసిన భేటీ..

ఇక ఢిల్లీలో అమిత్ షా, చంద్రబాబు భేటీ ముగిసింది. నిన్న(మంగళవారం) విజయవాడలో కేబినెట్ భేటీ అనంతరం ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు.. అమిత్ షా తో భేటీ అయ్యారు. గతంలో ఇతర మంత్రుల ముందు ఉంచిన విన్నపాలనే ఆయన మరోసారి అమిత్ షా కు వివరించినట్టు తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక సాయం చేయాలని అమిత్ షా ని కోరినట్టు చంద్రబాబు తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో పేర్కొన్నారు. విభజన చట్టం అమలు, అమరావతికి సాయం, పోలవరం ప్రాజెక్టుకి నిధులు కేటాయించాలని కూడా విజ్ఞప్తి చేశానన్నారు. రహదారులు, రైలు మార్గాలు, విశాఖ రైల్వేజోన్ గురించి కూడా చంద్రబాబు విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా బడ్జెట్ కేటాయింపుల్లో ఏపీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అమిత్ షా ని కోరినట్టు ట్వీట్ వేశారు చంద్రబాబు.


చంద్రబాబు విన్నపాలు కొత్తవేం కాదు, గత పదేళ్లుగా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో ఉంది, 2014నుంచి 2019 వరకు అప్పటి సీఎం చంద్రబాబు, 2019 నుంచి 2024 వరకు సీఎంగా ఉన్న జగన్.. అవే విన్నపాలు పదే పదే చేశారు కానీ ఫలితం లేదు. ఇప్పుడు మళ్లీ సీఎం అయిన చంద్రబాబు.. పాత కోరికలనే కొత్తగా వారి ముందు ఉంచారు. ఏపీకి న్యాయం చేయడంలో పదేళ్లు తాత్సారం చేసిన కేంద్రం ఇప్పుడైనా కనికరిస్తుందా..? కేంద్రంలో అధికారంలో ఉండాలంటే టీడీపీ మద్దతు తప్పనిసరి అయిన సందర్భంలో ఏపీకి న్యాయం చేస్తుందా..? వేచి చూడాలి.

Tags:    
Advertisement

Similar News