అసాధ్యం, మోసం, నమ్మకద్రోహం..
ఖర్చులన్నీ తగ్గించుకుంటూ సీఎం జగన్ పాలన సాగిస్తే రూ.70వేల కోట్లతో పథకాలను కొనసాగించగలుగుతున్నారు. చంద్రబాబు హామీలు అమలు చేయాలంటే రూ.1,50,718 కోట్లు కావాలి.
చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో అమలు చేయడం అసాధ్యం..
అసాధ్యం అని తెలిసీ ఆ మేనిఫెస్టో ప్రకటించడం ఆయన చేసిన మోసం.
మోసంతో ప్రజల్ని వంచించి ఓట్లు వేయించుకోవాలని చూడటం నమ్మక ద్రోహం.
ఇదీ చంద్రబాబు మేనిఫెస్టో కథ. దీన్ని విశ్లేషించి చూస్తే చంద్రబాబు ఎలాంటి మోసగాడో ఇట్టే అర్థమవుతుంది.
చంద్రబాబు మొదటగా ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలంటే..
ఆడబిడ్డ నిధికోసం - రూ. 37,313 కోట్లు
ఉచిత గ్యాస్ సిలిండర్ల కోసం - రూ. 4,634 కోట్లు
తల్లికి వందనం కోసం - 12,450 కోట్లు
అన్నదాత కోసం - రూ.10,706 కోట్లు
మహిళల ఉచిత ప్రయాణం - రూ. 2,500 కోట్లు
యువతకు ఉపాధి, నిరుద్యోగ భృతి కోసం - రూ. 7,200 కోట్లు
మొత్తంగా రూ.74,803 కోట్లు అవసరం
ఇవి కాకుండా మిగతా హామీలు అమలు చేయాలంటే రూ.46,816 కోట్లు అవసరం.
అన్నీ కలుపుకొంటే టీడీపీ మేనిఫెస్టోలో ఉన్నది ఉన్నట్టు అమలు చేయాలంటే మొత్తంగా ఖర్చుపెట్టాల్సింది రూ. 1,21,619కోట్లు..
అంటే ఇప్పుడున్న బడ్జెట్ తో ఇది ఏమాత్రం సాధ్యం కాదు. ఆ విషయం తెలిసీ చంద్రబాబు బూటకపు హామీ ఇచ్చారు. అయితే ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. చంద్రబాబు ప్రకటించకపోయినా ప్రస్తుతం వైసీపీ అమలు చేస్తున్న కొన్ని పథకాలను కచ్చితంగా కొనసాగించాల్సిన అవసరం ఉంది.
9 లక్షలమంది విద్యార్థులకు జగన్ ఫీజు రీఎంబర్స్ మెంట్ అందిస్తున్నారు. దానికయ్యే ఖర్చు రూ.2,800 కోట్లు. వసతి దీవెనకోసం రూ. 2,200కోట్లు. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా కోసం రూ.4,400కోట్లు. గోరుమద్ద, సంపూర్ణ పోషణ, ఉచిత బియ్యం, రైతులకు ఉచిత కరెంటు.. ఇలా మొత్తం కలిపి రూ.29,100 కోట్లు తప్పనిసరిగా ఖర్చు చేయాలి.
అంటే చంద్రబాబు చెబుతున్న మేనిఫెస్టోకి ఇది అదనం అనమాట. మొత్తం కలుపుకొంటే రూ.1,50,718 కోట్లు. ఏపీ బడ్జెట్ మొత్తం పథకాలకు సరిపోతే ఇక ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి వస్తుంది. చంద్రబాబు చెబుతున్నట్టు ఒకటో తేదీ కాదు కదా, 31వతేదీ కూడా జీతాలు ఇవ్వలేరు. అన్నీ చేయాలంటే పథకాలు పట్టాలెక్కవు. అంటే చంద్రబాబు మేనిఫెస్టో ఏ మాత్రం సాధ్యం కాని వ్యవహారం.
ఇతర ఖర్చులన్నీ తగ్గించుకుంటూ సీఎం జగన్ పాలన సాగిస్తే రూ.70వేల కోట్లతో పథకాలను కొనసాగించగలుగుతున్నారు. చంద్రబాబు హామీలు అమలు చేయాలంటే రూ.1,50,718 కోట్లు కావాలి. ఈ లెక్కలు అడిగితే సంపద సృష్టిస్తానంటూ మరో కట్టుకథ చెబుతున్నారు బాబు. సంపద ఎలా సృష్టిస్తారు.. ఎన్ని నెలల్లో అన్నికోట్ల ఆదాయాన్ని సంపాదిస్తారు. అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే రూ.4వేలు పెన్షన్ ఇస్తాను, తొలి సంతకం మెగా డీఎస్సీపై అంటున్న చంద్రబాబు సంపద సృష్టించేలోగా ఖర్చు చేయాల్సిన మొత్తం రెండింతలవుతుంది. అసాధ్యం అని తెలుస్తున్నా కూడా ఇంకా ఆ మేనిఫెస్టోతో ప్రజల్ని నమ్మించాలని చూస్తున్నారు. దాని గురించి ప్రచారం చేస్తున్న టీడీపీ నేతలయినా తాము చెబుతున్నవి పచ్చి అబద్ధాలని అనుకోవడం లేదా..? అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినవారు, ఆ తర్వాత అవే అబద్ధాలు కొనసాగించరని గ్యారెంటీ ఏముంది..? అంటే హామీల అమలు వాయిదా వేసుకుంటూ పోతారు. చివరకు 2014 మేనిఫెస్టోలాగే, 2024 మేనిఫెస్టోని మాయం చేస్తారు. అదే చంద్రబాబు మాస్టర్ ప్లాన్.