ఊరికో సైకోని తయారు చేసి నన్ను తిట్టిస్తారా..?

ఊరికో సైకోని తయారు చేసి జగన్ తన మీదకు వదులుతున్నారని మండిపడ్డారు చంద్రబాబు. తాను రోషం, ధైర్యం ఉండే వ్యక్తినని ప్రజలకు తప్ప తానెవరికీ భయపడబోనని అన్నారు.

Advertisement
Update:2022-11-17 18:12 IST

నాకిదే ఆఖరి ఎన్నిక అంటూ చంద్రబాబు చేసిన కామెంట్లపై ఇప్పుడు ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది. సింపతీ కోసం చంద్రబాబు ట్రై చేస్తున్నారంటూ వైసీపీ నేతలు గట్టిగా కౌంటర్లు ఇస్తున్నారు. భార్యని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తారా అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఈ కామెంట్లపై చంద్రబాబు రియాక్ట్ అయ్యారు. ఊరికో సైకోని తయారు చేసి జగన్ తన మీదకు వదులుతున్నారని మండిపడ్డారు. తాను రోషం, ధైర్యం ఉండే వ్యక్తినని ప్రజలకు తప్ప తానెవరికీ భయపడబోనని అన్నారు.

ప్రజలు తిరగబడతారు జాగ్రత్త..

తనను తిట్టించినా, తన ర్యాలీలపై రాళ్లు వేయించినా, కోడిగుడ్లు వేయించినా ప్రజలు చూస్తూ ఊరుకోరని తిరగబడతారని హెచ్చరించారు చంద్రబాబు. ప్రజలు తిరగబడితే పోలీసులు ఎన్ని లక్షల మందిని అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. ఏపీకి జగన్ శనిగ్రహంలా తయారయ్యారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2019లో ప్రజలు, ముద్దులకు మోసపోయి ఓటేశారని, ఇప్పుడు ఏం చేయాలో తెలియక చాలామంది బాధపడుతున్నారని అన్నారు చంద్రబాబు. మూడున్నరేళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయి, రౌడీయిజం, దోపిడీ, నేరాలు ఘోరాలు పెరిగిపోయాయని అన్నారు. ప్రతి యాక్షన్ కి రియాక్షన్ గట్టిగా ఉంటుందని జగన్ అది గమనించాలన్నారు. 

సీఎం ఇంటికి డబ్బు సంచులు..

ఆదోని ఎమ్మెల్యే కర్నాటక నుంచి మద్యం తెచ్చి అమ్ముతుంటారని, ఇసుక దందా కూడా చేస్తున్నారని అన్నారు చంద్రబాబు. ఆదోని ఎమ్మెల్యే సాయంత్రానికి డబ్బులు లెక్క పెట్టుకుంటున్నారని, సాయంత్రం అయితే సీఎం ఇంటికి డబ్బులు చేరవేస్తుంటారని ఆరోపించారు చంద్రబాబు. సీఎంవోలో అవినీతి జరిగితే ఖండించాల్సిన ముఖ్యమంత్రి వాటిని ఎత్తిచూపినవారిని అరెస్టు చేస్తున్నారని చెప్పారు. ప్రజలు ఒకే రాజధానిని కోరుకుంటున్నారని, వైసీపీ పేటీఎం బ్యాచ్ వచ్చి చూస్తే అర్థమవుతుందన్నారు. జగన్ కి ధైర్యం ఉంటే ఆదోనిలో మీటింగ్ పెట్టాలని సవాల్ విసిరారు. ఆర్థిక అసమానతలు తగ్గాలంటే ప్రత్యేక ప్రణాళిక అవసరం అని అన్నారు చంద్రబాబు. అందరూ ఆర్థికంగా ఎదిగే బాధ్యత తనదని చెప్పారు. పిల్లల భవిష్యత్తు కోసం తనను ఆశీర్వదించాలన్నారు. ముఖ్యమంత్రిగానే తాను తిరిగి అసెంబ్లీలో అడుగు పెడతానని ధీమా వ్యక్తం చేశారు చంద్రబాబు.

Tags:    
Advertisement

Similar News