గుంటనక్కల్ని వెంటేసుకున్న ముసలి పులి చంద్రబాబు

జగన్ వల్ల మంచి జరిగిందా? లేదా? అనేది కొలమానంగా తీసుకొని, ఆలోచించి ఓటు వేయాలన్నారు. రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో మీ దీవెనలు నాకు కావాలి అని ప్రజల్ని కోరారు జగన్.

Advertisement
Update:2023-04-26 16:21 IST

గుంటనక్కల్ని వెంటేసుకున్న ముసలి పులి చంద్రబాబు: వైఎస్ జగన్

అనుకున్నట్టుగానే చంద్రబాబుకి ఈరోజు ఫుల్ డోస్ ఇచ్చేశారు సీఎం జగన్. జాతీయ మీడియాలో చంద్రబాబు మాటలకు నార్పల సభలో కౌంటర్ ఇచ్చారు జగన్. చంద్రబాబు మాటలు వింటే తనకు పంచతంత్రంలోని కథ గుర్తొస్తుందన్నారు జగన్. దుష్టచతుష్టయాన్ని ఇప్పుడు నక్కల గుంపుతో పోల్చారు. ఆ నక్కల గుంపుకి నాయకుడైన ముసలిపులి చంద్రబాబేనని సెటైర్లు పేల్చారు.

అనంతపురం జిల్లా నార్పలలో వసతి దీవెన నిధులు విడుదల చేసిన సీఎం జగన్.. బహిరంగ సభలో చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. నర మాంసానికి అలవాటు పడిన పులి ముసలిదై వేటాడే శక్తి కోల్పోయాక గుంట నక్కలను వెంట వేసుకొని తిరుగుతుందని, చంద్రబాబు కూడా అలాగే ప్రతిపక్షాలను కలుపుకొని ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారని చెప్పారు. బంగారు కడియం ఆశ చూపి మనుషులను మింగేసే పులి లాగానే చంద్రబాబు కూడా వెన్నుపోటు కుట్రలు పన్నారని అన్నారు. మాయమాటలు చెప్పే చంద్రబాబు లాంటి వారిని నమ్మకూడదని హితవు పలికారు జగన్.

జగన్ చెప్పిన కథ ఇదే..

"అనగనగా అడవిలో ముసలి పులి ఓపిక లేక, వేటాడే శక్తి నశించి ఉన్నచోటే కూర్చుని మనుషుల్ని ఎలా తినాలని ప్లాన్‌ వేసుకుంది. దారిలో ఓ చెరువు పక్కన కూర్చుని.. వచ్చిపోయే మనుషులకు బంగారు నగల్ని ఆశ చూపెట్టేది.. ‘తమ్ముళ్లూ.. కడియం కావాలంటే నీటిలో మునగాలి’ అంటూ ఊరించేది. ఈ పులిని నమ్మితే తినేస్తుంది కదా అని అందరూ నమ్మకుండా వెళ్లిపోయేవారు. కానీ, ఆ పులి మాత్రం నేను సీనియర్‌ మోస్ట్‌ పులిని. అడవిలో నలభై ఏళ్ల ఇండస్ట్రీ నాది. గతంలో బాగా తినేవాడిని.. ఇప్పుడు మంచోడినైపోయి తినదల్చుకోలేదని అబద్ధపు మాటలు చెప్పేది. పులి ముసలిది అయిపోయింది కదా.. అని నమ్మిన వాళ్లు నీటిలో మునిగి ఆ నగలు తీసుకునే ప్రయత్నం చేసేవాళ్లు. ఆ మడుగులో బురదతో ఇరుక్కుంటే పులి చంపేసి తినేసేది. అందుకే అబద్ధాలు చెప్పేవారి మాటలు నమ్మకూడదు " అంటూ జగన్ ఆ కథను ముగించారు.

చంద్రబాబు అధికారంలోకి వచ్చి రైతుల్ని నిండా ముంచారని, అక్క చెల్లెమ్మల పొదుపు రుణాలు మాఫీ చేస్తానని మోసం చేశారని, సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేశారని, నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి మొండి చేయి చూపించారని, ఇప్పుడు మళ్లీ మోసం చేసేందుకు చంద్రబాబు ప్రజల్లోకి వస్తున్నారని అన్నారు జగన్. రాబోయే రోజుల్లో చంద్రబాబు మరిన్ని అబద్ధాలు చెబుతారని అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. చంద్రబాబుకు తోడుగా ఓ గజదొంగల ముఠా ఉందని, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5.. వీరికి తోడుగా దత్తపుత్రుడు.. ఇది గజదొంగల ముఠా... అని చెప్పారు జగన్. జగన్ వల్ల మంచి జరిగిందా? లేదా? అనేది కొలమానంగా తీసుకొని, ఆలోచించి ఓటు వేయాలన్నారు. రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో మీ దీవెనలు నాకు కావాలి అని ప్రజల్ని కోరారు జగన్. 

Tags:    
Advertisement

Similar News