అవినీతిచేసి దొరికినా అరెస్టు చేయకూడదా..?

అవెక్సా కంపెనీ రూ. 66 కోట్ల అవినీతికి పాల్పడిందని కేంద్ర సంస్థ‌ల దర్యాప్తులో బయటపడింది. డెరక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, సెంట్రల్ జీఎస్టీ ఉన్నతాధాకారుల ఫిర్యాదుతో విజయవాడ పోలీసులు శరత్ ను అరెస్టుచేశారు.

Advertisement
Update:2024-03-01 10:48 IST

చంద్రబాబునాయుడు వ్యవహారం చాలా విచిత్రంగా ఉంది. తెలుగుదేశం పార్టీ నేతలు లేదా వాళ్ళ కుటుంబ సభ్యులైతే చాలు ఏమిచేసినా వాళ్ళపై ఎలాంటి యాక్షన్ తీసుకోకూడదన్నట్లుగా మాట్లాడుతున్నారు. అవినీతికి పాల్పడి అరెస్టయినా కక్షసాధింపు అంటూ నానా గోలచేస్తున్నారు. ఇప్పుడు విషయం ఏమిటంటే.. చంద్రబాబు హయాంలో రాజధాని అమరావతి పేరుతో నాసిరకం నిర్మాణాలు జరిగిన విషయం తెలిసిందే. నిర్మాణ సంస్థ‌ల నుండి కొన్ని పనుల కోసం మరికొన్ని సంస్థ‌లు సబ్ కాంట్రాక్టులు తీసుకున్నాయి. అయితే పనులు తీసుకున్న సబ్ కాంట్రాక్టు సంస్థ‌లు ఆ పనులను తాము చేయకుండా వేరే కంపెనీలకు అప్పగించాయి.

కొన్ని సబ్ కాంట్రాక్టు సంస్థ‌లు తాము తీసుకున్న పనులను ఇతర కంపెనీలతో చేయించకుండానే చేసినట్లు నిర్మాణ సంస్థ‌లనుండి బిల్లులు తీసేసుకున్నాయి. అలా తీసుకున్న కోట్ల రూపాయలను షెల్ కంపెనీలకు తరలించాయి. అంటే అక్కడ పనులు లేవు, చేసిందీలేదు. అయితే పనులున్నట్లు, ఆ పనులను పూర్తి చేసినట్లు, కంపెనీల ద్వారా పనులు చేయించినట్లు ఇన్వాయిసులు సృష్టించి నిర్మాణ సంస్థ‌ల నుంచి కోట్లాది రూపాయలు బిల్లులు తీసుకోవటమే కాకుండా సదరు ఇన్వాయిసులను కేంద్ర రెవెన్యూ విభాగానికి పంపి ఇన్ పుట్ ట్యాక్స్ సబ్సిడీని కూడా పొందాయి. అలాంటి కంపెనీల్లో టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబం కంపెనీ అవెక్సా కూడా ఒకటి.

ఇలా రెండురకాలుగా అందుకున్న కోట్లాది రూపాయలను షెల్ కంపెనీలకు పంపించాయి. ఇప్పుడిదంతా ఎందుకంటే.. ప్రత్తిపాటి పుల్లారావు కొడుకు ప్రత్తిపాటి శరత్ డైరెక్ట‌ర్‌గా ఉన్న అవెక్సా కంపెనీ బాగోతం బయటపడింది. అవెక్సా కంపెనీ పైన చెప్పిన పద్దతిలో రూ. 66 కోట్ల అవినీతికి పాల్పడిందని కేంద్ర సంస్థ‌ల దర్యాప్తులో బయటపడింది. డెరక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, సెంట్రల్ జీఎస్టీ ఉన్నతాధాకారుల ఫిర్యాదుతో విజయవాడ పోలీసులు శరత్ ను అరెస్టుచేశారు. ఇంకేముంది వెంటనే తమ్ముళ్ళంతా రంగంలోకి దిగేశారు. శరత్ ను అక్రమంగా కేసులో ఇరికించి అరెస్టుచేశారని నానా గోల మొదలుపెట్టారు. శరత్ అరెస్టు కక్షసాధింపే అంటూ చంద్రబాబు రచ్చచేస్తున్నారు.

పుల్లారావు మాట్లాడుతూ తన కొడుకేమైనా హత్యచేశాడా ? మానభంగం చేశాడా ? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. డీఆర్ఐ జగన్మోహన్ రెడ్డి చెప్పుచేతిలో ఉంటుంది కాబట్టి అరెస్టుచేసి వేధిస్తున్నట్లు ఆరోపించారు. డీఆర్ఐ అన్నది కేంద్ర ఆర్థికశాఖ పరిధిలోనిది. ఆర్థిక అక్రమాలపై డీఆర్ఐ విచారణ చేస్తుంది. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే.. అవెక్సా కంపెనీ రూ. 66 కోట్లు అక్రమంగా సంపాదించిందని తేల్చింది, శరత్ పై ఫిర్యాదిచ్చింది కూడా కేంద్ర సంస్థ‌లే. అరెస్టుచేసింది మాత్రం విజయవాడ పోలీసులు. వాస్తవాలు ఇలాగుంటే రాష్ట్రప్రభుత్వం శరత్ ను అన్యాయంగా అరెస్టుచేసిందని తమ్ముళ్ళు కలరింగ్ ఇస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News