పొత్తూ.. పోరూ.. కొడుకు కోసమే..!
కేవలం తన సామాజికవర్గ ప్రయోజనాల కోసమే ఓ రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టిన బాబుకు ఓటుతో బుద్ధి చెప్పారు ఏపీ ప్రజానీకం. ఆ అరాచక పాలన భరించలేకే ఐదేళ్లుగా ఇంట్లో కూర్చోబెట్టారు.
రాజకీయం ఓ మాయ.. ఏది నిజమో, ఏది అబద్ధమో తేల్చుకునేలోపే కోటలు కూలిపోతాయి. ప్రజలు ఓ నాయకున్ని కావాలనుకుంటే ఆకాశం విరిగి మీద పడ్డా గెలిపించుకునే దాకా ఆగరు.. ఓడించాలనుకుంటే కాళ్ల కింద భూమి బద్దలైపోతున్నా ఓడించక మానరు. అందుకే జనం కోసం, జనంలో నిలబడే నాయకులు ఓడిన దాఖలాలు ఇప్పటికీ లేవు. అనుయాయులను పంచన చేర్చుకుని అక్రమాల కోటలెక్కిన నాయకులకు అథఃపాతాళం తప్పలేదు. మాజీ సీఎం చంద్రబాబే అందుకు ఉదాహరణ.
కేవలం తన సామాజికవర్గ ప్రయోజనాల కోసమే ఓ రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టిన బాబుకు ఓటుతో బుద్ధి చెప్పారు ఏపీ ప్రజానీకం. ఆ అరాచక పాలన భరించలేకే ఐదేళ్లుగా ఇంట్లో కూర్చోబెట్టారు.. మళ్లీ రావొద్దు బాబు అని బలంగా చెప్పారు. అయితే, ఐదేళ్లే కదా.. ఓడడం కొత్తా, ఐదేళ్లు పోతే మసి పూసి మారేడుకాయ చేసి మళ్లీ పీఠమెక్కొచ్చన్న చంద్రబాబు ఆశలపై జగన్ నీళ్లు చల్లారు. సంక్షేమాలతో, ఎప్పుడూ చూడని అభివృద్ధి పనులతో నిత్యం జనంలోనే నిలబడ్డారు జగన్.
పెరిగిన పెన్షన్లు, పేదోడికి నిలువ నీడ కల్పించే ఇండ్లు, బాబు చిన్నచూపు చూసిన సర్కారు బడులకు మెరుగులు, వీళ్లకెందుకు ఆంగ్లమని అపహాస్యం చేసినా పట్టువదలక తెచ్చిన ఇంగ్లిష్ మీడియం చదువులు, సొంతూళ్లోనే యువతకు సర్కారు నౌకర్లు.. వెరసి చంద్రబాబు కలలు భగ్నమయ్యే పనులే అన్నీ. దీనికితోడు నా సంగతేంటంటూ ఇంట్లో కొడుకు లోకేష్ ఏడుపు.. కోడలి మందలింపు. ఇలాగే వదిలేస్తే పార్టీ పగ్గాలు సైతం జూనియర్ చేతుల్లోకి వెళ్లిపోతాయని భావించిన బాబు హుటాహుటిన పొత్తు రాజకీయాలను తెరమీదకు తెచ్చాడు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి కొడుకును సీఎం పీఠమెక్కించి తాను నిష్క్రమించేందుకు ఎత్తులతో, కూటమి పొత్తులతో శాయాశక్తులా కృషి చేస్తున్నాడు.
అధికారం ఎలాగో రాదు.. ప్యాకేజీ అయినా..?
"ఈ ఎన్నికల్లో జనం దాదాపు వైసీపీ వైపే నిలబడ్డారని అంతర్గత సమాచారం ఉంది.. మీరు ఒంటరిగా పోటీ చేసినా ఒకటీ రెండూ స్థానాలూ వస్తాయో రావో అనుమానమే.. పొత్తులోకి రండి.. మంచి ప్యాకేజీ అయినా దక్కుతుంద"ని ఆశపెట్టి జనసేన పవన్‌ను పొత్తులోకి లాగాడు బాబు. నమ్మి దిగి.. ఇప్పుడు పద్దెనిమిది సీట్లతో సరిపెట్టుకోవడంతో పాటు సొంత పార్టీ నేతలు, కేడర్ నుంచి తీవ్ర వ్యతిరేకత. పోటీ చేస్తున్న సగం స్థానాల్లోనూ తెలుగు దేశం అభ్యర్థులనే దించాలనే నిర్ణయంతో పాటు ఎక్కడా టీడీపీ శ్రేణులు కలిసిరాకపోవడం, పార్టీ గుర్తునూ కోల్పోయి ఏం చేయాలో పాలుపోని దుస్థితికి చేరాడు పవన్. అయితే, వచ్చే ఎన్నికల నాటికి జనానికి పవన్ ను పూర్తిగా దూరం చేసి లోకేష్ ను ఎలివేట్ చేయాలన్న పథకం కూడా ఈ పొత్తు వెనక ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పార్టీకి దూరమవుతున్న జనసైనికులు పవన్ ను పూర్తిగా నమ్మకుండా చేసేందుకు తెరవెనక కుట్రలు చేస్తున్నారంటున్నారు.
కమలం ఉంటే కలిసొస్తుందనీ..!
చెరువు దాకా తేగలం కానీ నీళ్లు తాగించలేం గదా అన్నట్టు మారింది కూటమిలో కమలం పొత్తు. కేంద్ర సర్కారు అండ ఉంటే కొడుకు భవిష్యత్తు పదిలమనుకుని ఢిల్లీ నేతల కాళ్లబేరానికి వెళ్లిన బాబు వదినమ్మ సాయంతో పొత్తులోకి దించగలిగాడు కానీ.. పార్టీ శ్రేణులతో పాటు కేంద్రంలో కీలక నేతల మద్దతు కూడగట్టడంలో నూటికి వెయ్యిపాళ్లు విఫలమయ్యాడు.
తెలంగాణా నుంచి పెయిడ్ బృందాలు
ఈనాడు, ఏబీఎన్, ఆంధ్రజ్యోతి, టీవీ5.. జనంలో ఎప్పుడో మన్నన కోల్పోయిన తన విష పుత్రికలను ఆర్నెళ్ల ముందు నుంచే రంగంలోకి దించాడు బాబు. ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చి హైదరాబాద్ సిటీ బ్యూరో, తెలంగాణ స్టేట్ బ్యూరోతో పాటు పలు తెలంగాణా జిల్లాల్లో పనిచేసే రిపోర్టర్లను సైతం ఏపీలోని పలు ప్రాంతాల్లో దించారు. టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చే సమాచారంతో పాటు ఎప్పటికప్పుడు కల్పిత విషయాల్ని జనంలోకి ఎక్కించేందుకు, స్థానిక యువతను రెచ్చగొట్టేందుకు ప్రత్యేక వాట్సాప్ గ్రూపుల ద్వారా ఈ బృందాలు పన్నాగాలు రచిస్తున్నాయి. ప్రచారానికి వచ్చే వైసీపీ నాయకులకు నిరసన సెగ తగిలినట్లు వార్తలు సృష్టించడం, కొందరికి డబ్బులిచ్చి వీడియోలు రికార్డు చేయించడం ఈ బృందాలకు ఇచ్చిన ప్రత్యేక టాస్క్.
ఇదే చివరి సారని..
ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కొత్త ఎత్తులకు పదును పెడుతున్నాడు బాబు. ఈసారి కాకుంటే జీవితంలో కొడుకు రాజకీయాల్లో ఉండలేడని భావించి.. ఈ ఎన్నిక తనకే చివరిదనే సెంటిమెంటుతో పాటు ప్రత్యర్థి పార్టీలు చేసినట్టుగా బూటకపు దాడులు, ప్రధాన పార్టీ నేతలపైనా భౌతిక దాడులు చేయించే విషపు కుట్రలకు పన్నాగం రాసేందుకూ ప్రత్యేక బృందాలను నియమించుకున్నారనే సమాచారం. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ సైతం బ్లేడులతో కోస్తున్నారనే మాట జనంలోకి చేర్చేందుకు ప్రతీ ప్రసంగంలో విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్ని కుట్రలు చేసినా జనం ఇప్పటికే నిర్ణయించుకున్న తమ బంగారు భవిష్యత్తు నిర్మించే సారథికే ఓటేస్తారన్నది మార్చలేని సత్యం.