చంద్రబాబుకు జగనే దిక్కా?

తమ పథకాలకే పేర్లు మార్చి జగన్ కొత్తగా పథకాలు పెడుతున్నట్లు ఫోజులు కొడుతున్నాడని ఒక‌ప్పుడు నానా గోల చేసిన చంద్రబాబు రివర్సులో జగన్ పథకాలను ఇప్పుడు కాపీ కొడుతున్నారు.

Advertisement
Update:2023-04-29 10:39 IST

జగన్మోహన్ రెడ్డి లేకపోతే పాపం చంద్రబాబు నాయుడు ఏమైపోయేవారో. ఎందుకంటే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీలో సరుకు అయిపోయినట్లుంది. అందుకనే జగన్ పథకాలను గుడ్డిగా ఫాలో అయిపోతున్నారు. వివిధ పథకాలకు జగన్ పెట్టిన పేర్లను మాత్రం మారుస్తున్నారంతే. తమ పథకాలకే పేర్లు మార్చి జగన్ కొత్తగా పథకాలు పెడుతున్నట్లు ఫోజులు కొడుతున్నాడని ఒక‌ప్పుడు నానా గోల చేసిన చంద్రబాబు రివర్సులో జగన్ పథకాలను ఇప్పుడు కాపీ కొడుతున్నారు. ఎందుకిలా, కొత్త పథకాలను ఆలోచించి, కొత్త ప్రోగ్రాములను రూపొందించటంలో చంద్రబాబు బుర్ర మందగించిందా అనే సందేహం పెరిగిపోతోంది.

ఇంతకీ విషయం ఏమిటంటే చంద్రబాబు పాల్గొంటున్న ప్రోగ్రాముల పేర్లు దాదాపు జగన్ నిర్వహిస్తున్న ప్రోగ్రాములనే తలపిస్తాయి. జగనన్నే మన భరోసా పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇదే తరహాలో చంద్రన్నే మన భరోసా అనే కార్యక్రమం చేస్తున్నది టీడీపీ. వైసీపీవాళ్ళు ఇంటింటికి స్టిక్కర్లు అంటిస్తుంటే టీడీపీవాళ్ళూ స్టిక్కర్లు అంటిస్తున్నారు. ఆ మధ్య గడపగడపకు మ‌న ప్ర‌భుత్వం అని జగన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అదే తరహాలో ఇంటింటికి టీడీపీ అనే కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రకటించారు.

జగన్ వలంటరీ వ్యవస్థ‌ను ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థ‌ జనాల్లోకి బాగా చొచ్చుకుపోయింది. కొత్తల్లో దీనిపై చంద్రబాబు చేయని ఆరోపణలేదు. తర్వాత అదే వ్యవస్థ‌ జనాల్లో బాగా పాపులరైన విషయం గ్రహించారు. అందుకనే మాట మార్చేసి తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యవస్థ‌ను కంటిన్యూ చేస్తామని చెప్పుకున్నారు. జగన్ గృహసారథుల‌ పేరుతో పార్టీలో ఒక వ్యవస్థ‌ను ఏర్పాటు చేశారు. వెంటనే చంద్రబాబు పార్టీలో సాధికార సారథులని నియమిస్తున్నట్లు ప్రకటించారు.

జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం గుల్లయిపోతోందని చంద్రబాబు నానా గోల చేశారు. రాష్ట్రాన్ని శ్రీలంకతో పోల్చారు. సంక్షేమ పథకాల అమలుపై జనాలు పాజిటివ్‌గా ఉన్నారని గెలుసుకుని వెంటనే యూటర్నర్ తీసుకున్నారు. తాను అధికారంలోకి రాగానే ఇంతకన్నా ఎక్కువ పథకాలు అమలు చేస్తానని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో కూడా గెలవాల్సిందే అని జగన్ టార్గెట్ పెట్టగానే చంద్రబాబు కూడా పులివెందులలో టీడీపీ గెలవాలన్నారు. చంద్రబాబు వైఖరి ఎలాగుందంటే జగన్ ఏ పథకాన్ని ప్రకటిస్తారా వెంటనే తాను కూడా ప్రకటించేద్దామా అని ఎదురుచూస్తున్నట్లుంది.

Tags:    
Advertisement

Similar News