ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
తాము వైసీపీ మీద దృష్టి పెట్టబోమని, వారికి ఆల్రడీ ప్రజలు శిక్ష వేశారని, తాము కేవలం పాలనపై దృష్టి పెడతామన్నారు బాబు.
2019 ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లు వస్తే అది దేవుడు రాసిన స్క్రిప్ట్ అని హేళన చేశారని, నేడు కూటమికి 164 సీట్లు వచ్చాయని ఇది దేవుడు రాసిన అసలైన స్క్రిప్ట్ అని అన్నారు చంద్రబాబు. ఏపీ అసెంబ్లీ సమావేశాల రెండోరోజు ఆయన వైసీపీపై సెటైర్లు పేల్చారు. వైనాట్ 175 అని సవాళ్లు చేసిన వైసీపీ చివరకు 11 సీట్లకు పరిమితమైందన్నారాయన. "నా జీవితంలో ఎప్పుడూ చూడని సభ 15వ శాసన సభ. 15వ శాసనసభను కౌరవసభగా మనం భావించాం. అత్యున్నత, గౌరవప్రదమైన సభగా 16వ సభను తీర్చిదిద్దాలి" అని అన్నారు చంద్రబాబు. తాము వైసీపీ మీద దృష్టి పెట్టబోమని, వారికి ఆల్రడీ ప్రజలు శిక్ష వేశారని, తాము కేవలం పాలనపై దృష్టి పెడతామన్నారు బాబు. వైసీపీ ఎమ్మెల్యేలు పిరికితనంతో సభ నుంచి పారిపోయారన్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ని కూడా సభలో పొగడ్తల్లో ముంచెత్తారు చంద్రబాబు. పవన్‌ను అసెంబ్లీ గేటు కూడా తాకనీయబోమని వైసీపీ నేతలు అన్నారని కానీ వారి కలలు ఫలించలేదన్నారు. పోటీ చేసిన 21 స్థానాల్లో పార్టీని గెలిపించిన నాయకుడు పవన్ అని అభినందించారు. ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్ అని అన్నారు చంద్రబాబు.
అయ్యన్న ఫైర్ బ్రాండ్..
అసెంబ్లీలో అత్యంత సీనియర్ సభ్యుల్లో అయ్యన్నపాత్రుడు ఒకరని అన్నారు సీఎం చంద్రబాబు. అందరి ఆమోదంతో ఆయన అసెంబ్లీ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంతోషమన్నారు. ఎన్టీఆర్ పిలుపుతో 25 ఏళ్లకే రాజకీయాల్లోకి వచ్చిన అయ్యన్న, 7 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రిగా.. అయ్యన్న అన్ని పదవులకూ వన్నె తెచ్చారన్నారు. 66 ఏళ్ల వయసు ఉన్నా ఆయన ఇప్పటికీ ఫైర్ బ్రాండేనన్నారు చంద్రబాబు. 23 కేసులు పెట్టినా ఆయన రాజీలేని పోరాటం చేశారని చెప్పారు.